టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం


*పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల ప్రసాదరావు
*జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్
*జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్
*రాష్ట్ర కమిటీలో 17మందికి చోటు

                    (విశాలాంధ్ర-తిరుపతి, చిత్తూరు)

తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఎంపికలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక సమతూకం పాటించడంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అటు అనుభవానికి, ఇటు యువతకు సమానంగా పెద్దపీట వేస్తూ రూపకల్పన చేసిన ఈ కమిటీలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తాయనడంలో సందేహం లేదు.

పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల

పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలకు స్థానం దక్కింది. కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సహజంగానే ఇందులో ఉండగా, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావుకు సైతం ఈ కీలక విభాగంలో చోటు కల్పించడం విశేషం. దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి ప్రసాదరావును పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా పార్టీ తన సామాజిక నిబద్ధతను చాటుకుంది. మేధావి వర్గానికి, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ యువ రక్తం, భావి వారసుడు నారా లోకేష్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు అప్పగించడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మంగళగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించి, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా రాణిస్తున్నప్పటికీ… తిరుపతి జిల్లా నారావారిపల్లి ముద్దుబిడ్డగా జిల్లా ప్రజలకు ఆయనపై ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంటు పదవితో పాటు పొలిట్ బ్యూరోలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా హోదా కల్పించడం ద్వారా పార్టీ జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసింది. గత ఐదేళ్లలో కష్టకాలంలో పార్టీని నడిపిన తీరుకు, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన తీరుకు ఇది తగిన గుర్తింపుగా భావించవచ్చు.

జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్

జాతీయ స్థాయిలో పార్టీ వాణిని వినిపించే కీలక బాధ్యతను తిరుపతికి చెందిన నీలాయపాళెం విజయకుమార్ కు అప్పగించారు. విశ్లేషణాత్మక ధోరణి కలిగిన విజయకుమార్ కు జాతీయ అధికార ప్రతినిధి హోదా దక్కడం ద్వారా, జాతీయ మీడియాలో జిల్లా నేతల ప్రాతినిధ్యం పెరగనుంది. మొత్తం మీద జాతీయ కమిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నలుగురు నేతలు ఉండటం ఆ జిల్లా రాజకీయ ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

రాష్ట్ర కమిటీలో 17 మందికి చోటు

రాష్ట్ర కమిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహభాగం దక్కింది. మొత్తం 17 మందికి వివిధ హోదాల్లో బాధ్యతలు అప్పగించారు. పదవుల పంపిణీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు తన మార్కు రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. పలమనేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్. అమరనాధరెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యంత కీలక బాధ్యత ఇచ్చారు. లోకేష్ పాదయాత్ర ఆద్యంతం ఆయన వెన్నంటే ఉండి సమన్వయం చేసిన అమరనాధరెడ్డి సేవలకు ఇది దక్కిన గౌరవం. అలాగే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు కూడా ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. సామాజిక న్యాయంలో భాగంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ గొల్ల నరసింహయాదవ్ ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. మేధావి వర్గ ప్రాతినిధ్యం కోసం తిరుపతికి చెందిన గురజాల మాల్యాద్రిని నాలెడ్జ్ కమిటీ బాద్యతలు ఇచ్చారు. బిల్లు చెంచురామయ్య (గూడూరు), అనిమిని రవినాయుడు (తిరుపతి), భీమినేని చిట్టిబాబు (గంగాధరనెల్లూరు)కు కార్యనిర్వాహక కార్యదర్శులుగా చోటు కల్పించారు.

మహిళలు, సామాన్య కార్యకర్తలకు గుర్తింపు

రాష్ట్ర కమిటీలో పదవుల పంపిణీలో మహిళలకు పెద్దపీట వేయడం ఈ ఎంపికలో హైలైట్. 10 మంది రాష్ట్ర కార్యదర్శులలో అధిక శాతం మహిళలకు చోటు కల్పించి మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని నిరూపించారు. మట్టం శ్రావణి (గూడూరు), గంగోడు నాగేశ్వరయాదవ్ (వెంకటగిరి), అనిత యాదవ్ (తిరుపతి), పురిమిట్ల కుమారి (తిరుపతి), డాక్టర్ గుమ్మడిపూడి దశరథాచారి (శ్రీకాళహస్తి), మాసారపు సుబ్బయ్య (శ్రీకాళహస్తి), పి.చందన స్రవంతి (సత్యవేడు), లక్ష్మీప్రసన్న(నగరి), ఆర్.మీరా నేతాజీ (నగరి), కర్జాల అరుణ (గంగాధరనెల్లూరు)ను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు.

కార్యకర్తల్లో నూతనోత్తేజం

పార్టీలో కష్టపడిన వారికే పదవులు దక్కుతాయనే సందేశాన్ని ఈ కమిటీల ద్వారా అధిష్టానం స్పష్టంగా ఇచ్చింది. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారికి, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పదవులు కేటాయించడం పట్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ. బీసీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ కేడర్ ను మరింత ఉత్తేజితం చేసేలా చంద్రబాబు వ్యూహరచన చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు దక్కిన ఈ సముచిత స్థానం, జిల్లా అభివృద్ధికి, పార్టీ పటిష్టతకు పునాది కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *