రైతు కుటుంబంలో పుట్టి క్రికెటర్‌గా ఎదిగిన సకిబ్
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా తళుక్కుమాన్నారు. బంతితో ప్రత్యర్ధి నడ్డి విరిచారు… ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. తలో నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారకులయ్యారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే… తర్వాత సకిబ్ ప్రత్యర్థి పని పట్టాడు. 4 ఓవర్లలో సకిబ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న డొనోవన్ ఫెరీరా సైతం సకిబ్ బౌలింగ్‌లో షాట్లు ఆడలేకపోయాడు. స్టార్‌గా మెరిసిన సకిబ్ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
ఇదీ సకిబ్ ప్రస్థానం…
తన అద్భుత ప్రదర్శనతో ఎంతగానో మెప్పించిన సకిబ్… అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చాడు. బిహార్‌కు చెందిన పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ఒక ప్రమాదంలో తండ్రి మోకాలికి గాయమై ఇంటికే పరిమితం కావడంతో సకిబ్ కుటుంబ పరిస్థితి దుర్భరస్థితికి చేరింది. ఒక పక్క తల్లికి వ్యవసాయ పనుల్లో తోడ్పడుతూ… సైన్యంలో చేరాలని లక్ష్యంగా ఎంచుకున్నాడు సకిబ్. ఆ ప్రయత్నంలో తనకెంతో ఇష్టమైన క్రికెట్ సాధన చేసేవాడు. తమ ప్రాంతంలో టెన్నిస్ బాల్ టోర్నీల్లో ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యాచ్‌లకు వెళ్లినపుడు వచ్చే డబ్బులతో తల్లికి కొంత ఆసరా అయ్యేవాడు. సకిబ్ ప్రతిభను రాబిన్ సింగ్ అనే కోచ్ గుర్తించాడు. తన అకాడమీలోకి తీసుకున్నాడు. పేదరికంలో ఉన్న ఆయనకు స్పైక్ షూలు కొనడానికి కూడా దగ్గర డబ్బుల్లేని పరిస్థితి. ఇది గమనించిన తల్లి తన నగలు అమ్మి కొడుకు అవసరం తీర్చింది. కఠోర సాధనతో అకాడమీలో బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ సిఫారసుతో బిహార్ క్రికెట్ లీగ్‌లో గయా గ్లాడియేటర్స్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. 140 కిలోమీటర్లపై వేగంతో బంతులేస్తూ నిలకడగా వికెట్లు తీయడంతో రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎంపిక చేసుకుంది. కానీ… తుది జట్టులో మాత్రం ఆడించలేదు. తర్వాతి సీజన్‌కు జట్టు నుంచి విడుదల చేసింది. 2026 ఐపీఎల్ కోసం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ సకిబ్ను రూ.30 లక్షలకు మాత్రమే జట్టులోకి తీసుకుంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు కూడా అతణ్ని తుది జట్టులో ఆడించలేదు. కానీ సోమవారం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సకిబ్ను బరిలోకి దించారు. వచ్చిన అవకాశాన్ని సద్దినియోగం చేసుకుని, అద్భుత ప్రదర్శనతో తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక సీజన్ అంతా అతను తుది జట్టులో చోటు సంపాదించుకుంటాడనే నమ్మకం కుదిరింది. నిలకడగా రాణిస్తే వచ్చే ఏడాది సకిబ్కు ఇంకా మంచి రేటు దక్కడం ఖాయం అనే అంచనాలు పెరుగుతున్నాయి.
The post ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు appeared first on Visalaandhra.


