బెంగాల్‌లో ప్రచార హోరు – Visalaandhra


పరస్పర విమర్శలకు దిగుతోన్న అధికార, విపక్ష నేతలు

రాయ్‌గంజ్(కోల్‌కతా): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో పశ్చిమబెంగాల్‌లో ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో రెడు విడతలుగా 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 2,926 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారని ఈసీ వెల్లడించింది. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 1,478 మంది పోటీ చేస్తున్నారని, రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాల నుంచి 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపింది. 13తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది. నిబంధనల ప్రకారం అభ్యర్థుల గెజిట్ వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార పక్షంతో పాటు రెండు ప్రధాన విపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార, విపక్ష నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.
రాజ్యాంగాన్ని విధ్వంసు చేస్తున్నాయి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని ముందుకెలుతున్నారు. విషపూరిత ఆలోచనలతో బీజేపీ, ఆరెస్సెస్‌లు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని, ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని రాహుల్ ఆరోపించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) విఫలమైందని విమర్శించారు. ఉత్తర దినౌజ్‌పూర్, మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ ప్రసంగించారు. ‘విద్వేషాన్ని రెచ్చగొట్టే బీజేపీ, ప్రజా వ్యతిరేక టీఎంసీకి మధ్య బెంగాల్ ప్రజలు చిక్కుకుపోయారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయం. మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతి, తప్ప్పుడు పాలనా విధానాలే రాష్ట్రంలో బీజేపీ విస్తరించేందుకు మార్గం సుగమం చేశాయి. టీఎంసీ ప్రభుత్వం హింసకు పాల్పడకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా తన బాధ్యతలను సరిగ్గా నిర్వహంచి ఉంటే ఇక్కడ బీజేపీ కాలుమోపగలిగేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని వాగ్దానం చేస్తే, 84 లక్షల మంది నిరుద్యోగభృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(సర్) ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికల గెలుపు కోసం మతం, కులం పేరిట ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ రెచ్చగొడుతోంది. కాంగ్రెస్ ఒక్కటే బీజేపీకు పోటీగా నిలబడి ఆ పార్టీని ఎదుర్కోగలదు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
బీజేపీకు వ్యతిరేకంగా ఓటేసి ప్రతీకారం తీర్చుకోండి: మమత
సర్ ప్రక్రియలో వ్యత్యాసం అనే పదం ఎన్నికల సంఘం(ఈసీ) నిబంధనల ప్రకారం అధికారికంగా గుర్తించినది కాదు. బిహార్‌లో వాడని దీనిని బీజేపీకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో పశ్చిమబెంగాల్‌లోనే ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ్ మేదినిపుర్, పూర్వ మేదినిపుర్ జిల్లాల్లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘శాంతి భద్రతలను కాపాడటమే కేంద్ర బలగాల పని. అటువంటి వారు ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకుంటే వారికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడాలని మహిళలను కోరుతున్నా. హింసకు పాల్పడాలని, అల్లర్లు చేయాలని తాను చెప్పడం లేదు. మీ హక్కులను కాపాడుకునేందుకు చేయగలిగిందంతా మీరు చేయండి. బీజేపీ లాంటి అసహ్యకరమైన పార్టీని తాను ఇంతవరకు చూడలేదు. ప్రజల హక్కులను హరించింది. బీజేపీకు వ్యతిరేకంగా ఓటు వేయడమే మీరు ప్రతీకారం తీర్చుకోడానికి ఉన్న ఏకైక మార్గం’ అని మమత వ్యాఖ్యానించారు.
గూర్ఖా సమస్యను పరిష్కరిస్తాం: అమిత్ షా
రాష్ట్రాన్ని విభజించకుండానే డార్జిలింగ్ కొండల్లోని గూర్ఖాల్యాండ్ సమస్యను బీజేపీ రాజ్యాంగబద్ధంగా పరిష్కరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణ దినాజ్‌పుర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. “పశ్చిమ బెంగాల్‌లో అక్రమ చొరబాటుదారుల ఏరివేతకు ప్రాధాన్యతనిస్తూనే రాష్ట్రంలో రాజకీయ హింస, సిండికేట్ వ్యవస్థ, కట్‌మనీ పాలనకు బీజేపీ ముగింపు పలుకుతుంది. మమతకు ఏజెంట్‌లా ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ వ్యవస్థాపకుడు హుమాయున్ కబీర్ పనిచేస్తున్నారు. ఆమె సమ్మతితోనే బాబ్రీ తరహా మసీదును నిర్మిస్తున్నారు. ఆ మసీదు కట్టడానికి బీజేపీ అనుమతించదు. రాజబాన్షీ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో చేర్చుతాం’ అని అమిత్ షా హామీ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *