Last Updated:
ఏపీలో మండుటెండలు తీవ్రం, డీహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయని వైద్యుల హెచ్చరిక, కూల్ డ్రింక్స్ మానుకుని మజ్జిగ కొబ్బరి బోండం తాగాలని అంబేద్కర్ కోనసీమ విద్యార్థుల అవగాహన ర్యాలీ పిలుపు
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా పడిన చిరు జల్లులు కాస్త ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా, గత రెండు రోజులుగా ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధారణంగా చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మండుటెండలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
ఉదయం 9 గంటలకే ఎండ తాకిడి పెరిగిపోతుండగా, మధ్యాహ్నానికి రోడ్లు నిప్పుల కుండలా మారుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిత్య కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక చెట్ల కిందనే రిక్షాలతో లేదా చిన్న నీడలలో విశ్రాంతి తీసుకుంటూ రోజును గడిపే పరిస్థితి కనిపిస్తోంది.
కాకినాడ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 11:30 దాటితే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అత్యవసరంగా బయటకు వచ్చినవారు మాత్రమే పచ్చని చెట్ల నీడలో లేదా శీతల పానీయాల దగ్గర తలదాచుకుంటున్నారు. ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అయితే ఈ సమయంలో చాలామంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నా, అవి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్‌ను తగ్గించడానికి సహజ పానీయాలైన మజ్జిగ, గంజి, కొబ్బరి బోండం తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే ముందు ఒక బాటిల్ మజ్జిగ తీసుకెళ్తే దాహం తీర్చుకోవడంతో పాటు శరీరానికి చల్లదనం కూడా అందుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థులు వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టారు. కొబ్బరి బోండాలతో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు సందేశం ఇచ్చారు. కూల్ డ్రింక్స్ కంటే సహజమైన కొబ్బరి నీటిని తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి అవసరమైన నీటిని సమృద్ధిగా తీసుకోవడం, అవసరం లేకుండా బయటకు వెళ్లకపోవడం, సహజ పానీయాలను వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ మండుటెండల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh
Apr 14, 2026 10:46 PM IST


