అన్నదాతకు విత్తన భరోసా.. – Visalaandhra


దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం

నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సంఘాలు ఏర్పడతాయి.
ఈ కార్యక్రమానికి నాబార్డు ఆర్థిక సహకారం అందించనుంది. రైతుల చేతుల మీదుగానే విత్తనోత్పత్తి చేయించి, వాటికి ప్రత్యేక బ్రాండ్‌ గుర్తింపు కల్పించి రైతులకు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటాయి.

అగ్రివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహణ
తెలంగాణ విత్తనోత్పత్తిలో దేశానికి కేంద్రబిందువుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ రంగంలో ఎక్కువగా ప్రైవేటు సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. ధరలు, విత్తనాల నాణ్యత, ఆశించిన దిగుబడులు రావడంలేదని రైతుల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విత్తనాల మొలక శాతం తక్కువగా ఉండటం, కొన్ని సందర్భాల్లో పూర్తిగా మొలకెత్తకపోవడం, పంట దిగుబడులు తగ్గిపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విత్తన చట్టంలోని లోపాల కారణంగా బాధిత రైతులకు తగిన పరిహారం కూడా అందని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కంపెనీల ఒప్పందాల కింద కొంతమంది రైతులు విత్తనోత్పత్తి చేస్తున్నప్పటికీ, వారికి సరైన లాభాలు దక్కడం లేదు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని విత్తన వ్యవస్థపై అగ్రివర్సిటీ సమగ్ర అధ్యయనం చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించింది. విత్తనాల ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలంటే రైతులే భాగస్వాములుగా ఉండే సహకార సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం అగ్రివర్సిటీ నుంచి స్పష్టమైన ప్రతిపాదనలు కోరింది.
అనంతరం అగ్రివర్సిటీ అధికారులు నాబార్డుతో సంప్రదింపులు జరిపారు.వ్యవసాయ రంగ ప్రోత్సాహక నిధి కింద గ్రాంటు మంజూరుకు నాబార్డు అంగీకరించడంతో, విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను అగ్రివర్సిటీ సమర్పించింది.

రూ.1.93 కోట్ల గ్రాంటు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నాబార్డు రూ.1.93 కోట్ల గ్రాంటును మంజూరు చేసింది. దానికి అనుగుణంగా అగ్రివర్సిటీ కార్యాచరణ ప్రారంభించింది.
తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 97 విత్తన సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రతి జిల్లాలో మూడు సంఘాల చొప్పున, ఒక జిల్లాలో నాలుగు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు.

శిక్షణతో పాటు ఉత్పత్తి
ఒక్కో విత్తన సహకార సంఘంలో 30 నుంచి 40 మంది ప్రగతిశీల రైతులు సభ్యులుగా ఉంటారు.
వారికి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, ప్యాకేజింగ్‌, నిల్వ, పంపిణీ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఎంపికైన రైతులకు అగ్రివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బ్రీడర్‌, ఫౌండేషన్‌ విత్తనాలను సరఫరా చేస్తారు. ఆయా పంటల సాగుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని విశ్వవిద్యాలయం అందిస్తుంది. శాస్త్రవేత్తలు తరచూ విత్తన క్షేత్రాలను సందర్శించి పర్యవేక్షణ చేపట్టి, విత్తనాల నాణ్యతను నిరంతరం పరిశీలిస్తారు. అనంతరం నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసే యూనిట్లలో విత్తనాల శుద్ధి నిర్వహిస్తారు. విత్తన సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన విత్తనాలకు ఃతెలంగాణ సీడ్‌ః పేరుతో బ్రాండింగ్‌ ఇస్తారు.వానాకాలం సీజన్‌కు సిద్ధం – అగ్రివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య
ఈవిత్తనాలను ముందుగా వ్యవసాయ సహకార సంఘాల సభ్య రైతులకు పంపిణీ చేస్తారు. మిగిలిన విత్తనాలను ఇతర రైతులకు రాయితీ ధరలకు విక్రయిస్తారు. ఈప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన అమలు చేసి, వానాకాలం సీజన్‌ నాటికి రైతులకు విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించారు.
ఈ నిర్ణయం పూర్తిగా విప్లవాత్మకమైనదని అగ్రివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య పేర్కొన్నారు.
రైతులను వేధిస్తున్న నకిలీ విత్తనాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, అన్నదాతలకు అన్ని విధాలా లాభం చేకూర్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
పంట దిగుబడులు పెంచడం,రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుందన్నారు.యుద్ధప్రాతిపదికన సంఘాలను ప్రారంభించి విత్తనోత్పత్తి చేపట్టి,వానాకాలం సీజన్‌కు ముందే పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *