కోల్‌కతా: కేంద్ర బలగాలను వాడుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి చూస్తోందని, బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని స్పష్టం చేశారు. ‘టీఎంసీ ఈసారి 226 సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’ అని మమత ధీమా వ్యక్తం చేశారు. బీర్‌భుమ్ జిల్లాలోని సూరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఎన్డీఏ పాలనలో ఉన్న 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సామాన్య ప్రజానీకం కోసం తాను వారందరితో ఒంటిచేత్తో పోరాడుతున్నానన్నారు. బీజేపీ విపరీతంగా డబ్బులు పంచుతున్నారని, డబ్బు పంపకాన్ని నిలువరించే అవకాశం లేకుండా రాష్ట్రానికి చెందిన బ్యూరోక్రాట్లు, పోలీసు ఉన్నతాధికారులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసేశారు. డబ్బుతోపాటు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు కూడా పంచుతున్నారని ఆరోపించారు. బిహార్ తదితర రాష్ట్రాల నుంచి రైళ్లు, బస్సుల్లో నకిలీ ఓటర్లను తరలిస్తున్నారని మమత ఆరోపించారు. యువ హృదయాలపై ప్రభావం చూపేందుకు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. బీజేపీని ప్రజలు నమ్మరాదని, డబ్బులు తీసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పెడతారని హెచ్చరించారు. ఖాతాల్లో డబ్బు వేసి ఆ తర్వాత ఈడీ, సీబీఐల ద్వారా కేసులు వేయిస్తారన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణలో భాగంగా 300 మంది మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన సన్యాసినిల (నన్‌లు) ఓట్లు తొలగించారని. భారత సేవాశ్రమ్ సమితి, రామకృష్ణ మిషన్, బేలూర్ మఠ్‌లకు చెందిన పలువురు మత గురువుల ఓట్లు తొలగించారని మమత తెలిపారు.


