విశాలాంధ్ర – నార్పల: మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పలు గ్రామాల్లో స్మశాన వాటికలకు భూములు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాలను దూర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.మేజర్ పంచాయతీలతో పాటు ఇందిరమ్మ కాలనీ, సిపిఐ కాలనీల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు వంటి కనీస సదుపాయాలు లేక ప్రజలు నిత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.అనంతరం చైతన్య కాలనీ నాగలకట్ట ప్రాంతం నుంచి 80 అడుగుల సీసీ రోడ్డును మంజూరు చేయాలని స్థానికులు, సిపిఐ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ రహదారి నిర్మాణం జరిగితే రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. స్మశాన వాటికలకు భూముల కేటాయింపు, రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజల తరఫున సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్ద పెద్దయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ, నారాయణప్ప, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.


