ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా


మోడీ సర్కార్ కు సిపిఐ హెచ్చరిక…

విశాలాంధ్ర.. ప్రత్యేక ప్రతినిధి/అనంతపురం బ్యూరో.. నూతన ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన “విబిజీ రాంజీ” చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, అనంతపురం జిల్లా సిపిఐ కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ పేదలకు ఉపాధి భరోసా కల్పించే పథకాన్ని బలహీనపరచడం దురదృష్టకరమన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి కొత్త పేరుతో సంస్కరణలు తీసుకురావడం పేదలపై దాడిగా అభివర్ణించారు.యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాల మద్దతుతో ఈ చట్టం రూపుదిద్దుకుందని గుర్తుచేసిన ఆయన… గ్రామాల్లోనే పని కల్పించే విధానం వల్ల వలసలు తగ్గాయని చెప్పారు. కొత్త చట్టంతో మళ్లీ వలసలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలను తీవ్రంగా విమర్శించిన ఆయన, కూలీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించేలా చూడాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ను పూర్తిగా రద్దు చేయడానికి విబిజి రాంజీ పథకాన్ని తీసుకువచ్చినట్లుగా ఉందని డి .రాజా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి విప్లవ గేయాలు సభికులను అలరించాయి

విబీజీ రాంజీ పథకం రద్దు కోసం ఢిల్లీ దాకా పోరాటం :సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

విబిజీ రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో గల్లి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్రం 90 శాతం నిధులు భరించేదని, ప్రస్తుతం దాన్ని 60 శాతానికి తగ్గించడం అన్యాయమన్నారు. మిగిలిన 40 శాతం రాష్ట్రాలు ఎలా భరిస్తాయో కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.కేంద్రం రైతులకు నాలుగు నెలలకు ఒకసారి నామమాత్రంగా రెండు వేల రూపాయలు ఇస్తూ ప్రచారానికి పరిమితమైందని ఆరోపించారు.యూపీఏ ప్రభుత్వ కాలంలో సీపీఐ మద్దతుతో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం సరికాదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.దేశంలోని కోట్లాది కష్టజీవుల హక్కుల కోసం నిర్వహించిన ఈ పాదయాత్ర ఎర్రజెండా పోరాటానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కార్పొరేట్ల లబ్ది కోసమే విభిజి రాంజీ పథకం: ఈశ్వరయ్య

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి విబిజి రాంజీ పథకాన్ని తీసుకురావడం వెనుక కార్పొరేట్ శక్తుల ఒత్తిడి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు.
ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… రైతులు, కూలీలకు మద్దతుగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని తెలిపారు.మహాత్మా గాంధీ ఉపాధి పథకం ప్రారంభం నుంచి సంవత్సరానికి సగటున 52 రోజులు పని కల్పించిందని, ఇప్పుడు 125 రోజులు ఇస్తామని చెప్పడం ఎలా సాధ్యమో కేంద్రం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో దీర్ఘకాల పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.ఈ పథకం వల్ల వలసలు గణనీయంగా తగ్గాయని, కొత్తగా ప్రతిపాదిస్తున్న విబిజీ రాంజీ పథకం కార్పొరేట్లకు అనుకూలంగా మారుతుందని విమర్శించారు. వేల కోట్ల బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడం పథకాన్ని బలహీనపరచడానికేనని అన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వెన్నుముక లేని ప్రభుత్వం పరిపాలిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు నూతన ఉపాధి చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.నూతన ఉపాధి చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని తీసుకువచ్చేదాకా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కొత్త చట్టాన్ని వెనక్కు తీసుకోండి: గుల్జార్ సింగ్ గొరియా

గ్రామీణ కూలీల జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచి, దాని స్థానంలో కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకురావడం దుర్మార్గమని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గొరియా మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విబిజి రాంజీ” చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో ఉపాధి హామీ కూలీల హక్కుగా ఉండేదని, ఇప్పుడు దానిని కేవలం బడ్జెట్ కేటాయింపుల పథకంగా మార్చేసారని విమర్శించారు. వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే కాలంలో 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే నిబంధన అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇది భూస్వాములకు చౌక కూలీలను అందించే కుట్రగా మారుతుందని అన్నారు.
వంద రోజుల కంటే ఎక్కువ పని ఇస్తామనే హామీ కేవలం మాటలేనని కొట్టిపారేసిన ఆయన, ప్రతి కార్మికుడికి ఏడాదికి కనీసం 200 రోజుల ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలని, వేతన చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, కొత్త చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని గుల్జార్ సింగ్ గురియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని తదితరులు ప్రసంగించారు
సిపిఐ కార్యదర్శివర్గ సభ్యులు కె.రామాంజనేయులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, కర్నూలు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు నాసర్జి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యుగంధర్ సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదా గాంధీ ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు సుందర్ రామరాజు రైతుకూలీ సంఘం నాయకులు రమణయ్య ఎస్ యు సి ఐ నాయకులు సిద్దు తదితరులు పాల్గొన్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *