దివ్యజ్ఞాన సమాజం వ్యవహారం
(విశాలాంధ్ర-చిత్తూరు) : చిత్తూరు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం… చిత్తూరు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కలెక్టరుకు రెండు వారాల గడువు విధించింది.
హైకోర్టులో బలమైన వాదనలు
బీసీ నేత బుల్లెట్ సురేష్ తరపు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో వాదనలు వినిపిస్తూ, సొసైటీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు రూ.వందల కోట్ల విలువైన ఆస్తులను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కొన్ని ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేశారని, దీనిపై జిల్లా కలెక్టరుతో సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చాలని స్పష్టం చేస్తూ జిల్లా కలెక్టరుకు నోటీసులు పంపాలని సూచించింది.
అర్థరాత్రి మరో చారిత్రక భవనం కూల్చివేత
ఒకవైపు ఈ వ్యవహారం హైకోర్టు విచారణలో ఉండగానే, చిత్తూరులో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. దివ్యజ్ఞాన సమాజానికి చెందిన మరో చారిత్రక భవనాన్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలోనే అత్యంత రహస్యంగా భవనాన్ని పడగొట్టడం వెనుక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణదారులు ఏ స్థాయికి బరితెగించారో ఈ ఘటన నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
పెండింగ్ రిజిస్ట్రేషన్ల పూర్తి
మరోవైపు, వివాదాస్పదంగా ఉన్న రెండు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేయడం గమనార్హం. గతంలో పెండింగ్‌లో ఉంచిన ఈ రిజిస్ట్రేషన్లను ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్యే అధికారులు పూర్తి చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రూ.వందల కోట్ల విలువైన దివ్యజ్ఞాన సమాజం ఆస్తుల కబ్జా పర్వం ఇప్పుడు జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. హైకోర్టు జోక్యంతోనైనా ఈ ఆస్తులకు విముక్తి లభిస్తుందో లేదో వేచి చూడాలి.


