ఏపీ అసెంబ్లీలో‘ఏఐ’ హాజరు – Visalaandhra


. 2028 నాటికి దేశంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం
. ఏప్రిల్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహప్రవేశం
. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు

విశాలాంధ్ర`సచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో సరికొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసన సభ గౌరవాన్ని పెంచుతూ, అత్యాధునిక సౌకర్యాలతో సభను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ చరిత్రలో తొలిసారిగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స’ సాంకేతికతతో సభ్యుల హాజరును నమోదు చేయనున్నారు. ఈ గురువారం నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందన్నారు. సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్న వెంటనే ఏఐ కెమెరాల ద్వారా వారి హాజరు ఆటోమేటిక్‌గా నమోదవుతుందన్నారు. ప్రస్తుతం దిగ్గజ సంస్థల సీఈవోలు సైతం బయోమెట్రిక్ వాడుతుంటే, ఏపీ అసెంబ్లీ అంతకంటే ఆధునిక సాంకేతికతను వాడుతోందని, త్వరలో పార్లమెంటులో కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని స్పీకర్ తెలిపారు. అమరావతిలో నిర్మించబోయే కొత్త అసెంబ్లీ భవనం దేశానికే తలమానికంగా నిలవనుందన్నారు. చుట్టూ నీరు, మధ్యలో 250 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన వ్యూ పాయింట్‌తో ఈ భవన నిర్మాణం ఉంటుందని తెలిపారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని, 300 మందికి పైగా సభ్యులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని అన్నారు. 2028 డిసెంబరు నాటికి ఈ భవనం పూర్తి చేసి, అందులోనే శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అమరావతిలో ప్రజా ప్రతినిధుల కోసం నిర్మించిన నివాస సముదాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్ నెలాఖరు నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నివాసాల్లో గృహ ప్రవేశం చేస్తారని స్పీకర్ వెల్లడించారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొనేలా, ఈ సారి సాంస్కృతిక కార్యక్రమాలను అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాసనసభను పారదర్శకతకు సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామని స్పీకర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *