ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని అయినా ప్రస్తావించవచ్చు. కానీ లోకసభ స్పీకర్ ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి మాట్లాడే అవకాశమే ఆయన ఇవ్వలేదు. ఈ తీర్మానంపై చర్చ ప్రారంభిస్తూ రాహుల్‌గాంధీ భారత పూర్వసేనాధిపతి మనోజ్‌ముకుంద్ నర్వణే రాసిన గ్రంథంలోని అయిదు పంక్తులు చదివి వినిపించాలనుకున్నారు. స్పీకర్ ఓం బిర్లా ససేమిరా అంగీకరించలేదు. దీని మీద చర్చకే అవకాశం లేకుండా పోయింది. స్పీకర్ పక్షపాత ధోరణి అడుగడుగునా కనిపించింది. ఏ ప్రతిపక్ష సభ్యుడైనా ఏ సందర్భంలోనైనా ప్రధానమంత్రి మోదీ పేరెత్తడానికి ప్రయత్నించగానే స్పీకర్‌కు కంపరం పుడ్తున్నట్టుంది. ఆయన ఎప్పుడూ నో నో అంటూ ఉంటారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తాము ఏ పార్టీకి చెందిన వారం అన్న దానితో నిమిత్తం లేకుండా అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని సమాన దృష్టితో చూడాలి. కానీ ఇటీవలి కాలంలో ఓం బిర్లా రాజ్యాంగబద్ధంగా తన విధులు నిర్వర్తించడం లేదు. దీనితో గత్యంతరం లేక కాంగ్రెస్ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానానికి మంగళవారం నోటీసు ఇచ్చింది. 118 మంది సభ్యుల మద్దతు ఉన్న ఈ నోటీసును కాంగ్రెస్ నాయకులు కె.సురేశ్, గౌరవ్ గొగోయ్, మహమ్మద్ జావేద్ ఈ అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. తన మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు కనక తాను ఈ వ్యవహారం అటో ఇటో తేలేదాకా ఆ స్థానంలో కూర్చోనని ఓం బిర్లా అంటున్నారు. తాను స్పీకర్ స్థానంలో కూర్చోవడం అనైతికం అని కూడా ఆయన అన్నారు. మంచిదే. కానీ సభను నిష్పాక్షికంగా నడపడం సైతం నైతికత కిందికే వస్తుందని మాత్రం బిర్లా అనుకోవడం లేదు. బడ్జెట్ సమావేశం ప్రారంభం అయినప్పటి నుంచీ స్పీకర్ వ్యాఖ్యానాలు వినిపించాయి. కొందరు నాయకుల వ్యాఖ్యలకు మాత్రం అవకాశం వచ్చింది. కానీ చర్చ జాడ ఎక్కడా వినిపించలేదు. బడ్జెట్ మీద చర్చ ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కొన్ని మాటలు మాట్లాడడానికి అనుమతిస్తామని స్పీకర్ చేంబర్‌లో జరిగిన సమావేశంలో అంగీకరించారు. కానీ సోమవారం దీనికీ స్పీకర్ ఆవకాశమే ఇవ్వలేదు. కానీ అధికారపక్ష సభ్యులు, బీజేపీకి భజన బృందంగా మారిపోయిన మీడియా ఈ రగడ అంతటికీ రాహుల్‌గాంధీ కారణం అని ఆరోపిస్తున్నారు. అసలు పూర్వ సేనాధిపతి పేరు రాహుల్ గాంధీ ఎత్తడమే తప్పు అన్న వితండవాదానికి దిగారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశ భద్రత విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి పూర్వ సేనాధిపతి రాసిన “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ” లో రాసిన అంశాలను ప్రస్తావించడం సబబేనని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు ఎంత చెప్పినా స్పీకర్ వినిపించుకోలేదు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాధించడానికి కాంగ్రెస్ ఇచ్చింది నోటీసు మాత్రమే. ఈ తీర్మానం నియమబద్ధంగా ఉందని తేలితే ఆ 14 రోజులలోగా ఆ తీర్మానంపై చర్చ ప్రారంభించాల్సిందే. ఈలోగా ధన్యవాదాల తీర్మానంపై సమగ్ర చర్చ లేకుండానే, ప్రధానమంత్రి లోకసభలో సమాధానం ఇవ్వకుండానే తీర్మానాన్ని ఆమోదించేశారు. నిజానికి ఇది నియమ విరుద్ధమైంది. ప్రధానమంత్రి మోదీ లోకసభలో కాకుండా రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై సుధీర్ఘ ప్రసంగం చేశారు. అధికార ప్రతిపక్షాల మీద ఇంత వైమనస్యం కొనసాగుతున్నప్పటికీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకే బడ్జెట్ పై చర్చ మొదలైంది. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చి ఎనిమిదో తేదీ దాకా కొనసాగుతాయి. ఆ తరవాత కొంత విరామం తీసుకుని మళ్లీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చిన 14 రోజులలోగా చర్చ మొదలు కావాలి. ఇంకా సమయం ఉంది కనక ఈ చర్చ సాధ్యం కావొచ్చు. దాదాపు అందరు ప్రధానమంత్రుల మీద అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. అందులో కొన్ని తీర్మానాలు నెగ్గాయి. అంటే ప్రతిపక్షాలు విజయం సాధించాయి. కానీ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ఇంతవరకు మన పార్లమెంటు చరిత్రలోనే కనిపించలేదు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించవలసి రావడమే విచిత్రం. మౌలంకర్ స్పీకర్‌గా ఉన్నప్పుడు 1954లో ఒకసారి, 1966లో సర్దార్ హుకం సింగ్, 1987లో బలరాం జాఖడ్ మీద అవిశ్వాసాల తీర్మానాలు వచ్చాయి. కానీ ఏదీ నెగ్గలేదు. కానీ స్పీకర్ సంపూర్ణంగా అధికార పక్షానికి కొమ్ము కాయడం వల్ల ప్రతిపక్షాలకు మరో దారి లేకుండాపోయింది. ఈ పరిస్థితికి అధికారపక్షంతో పాటు స్పీకర్ ఓం బిర్లా కూడా కారణమే. జగదీప్ ధంకర్ మీద రాజ్యసభ అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చింది. కానీ సాంకేతిక కారణాల వల్ల దాని మీద చర్చ జరగలేదు. గత మూడేళ్ల పై నుంచి మోదీ పరిపాలనా తీరులో స్పష్టమైన మార్పు గోచరిస్తోంది. ఆయన అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారు. మోదీ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి కూడా స్పీకర్ పై తాజాగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వవలసి వచ్చింది. నర్వణే రాసిన గ్రంథం ప్రచురణే జరగలేదని పెంగ్విన్ రాండం హౌజ్ సంస్థ అంటోంది. నర్వణే కూడా ప్రచురణకర్త మాటనే సమర్థిస్తున్నారు. ఈ గ్రంథం మార్కెట్లో అందుబాటులో లేదని కూడా చెప్పారు. అయితే రాహుల్‌గాంధీ ఈ గ్రంథం ప్రతిని పార్లమెంటులోకి తీసుకొచ్చారు. ఆ ప్రతిని మోదీకి అందజేస్తాననీ అన్నారు. కానీ ఆ రోజు మోది లోకసభకే రాలేదు. ఆ తరవాత ఈ గ్రంథం పి.డి.ఎఫ్. ప్రతులు మాత్రం బాహాటంగానే అందుబాటులోకి వచ్చాయి. ప్రచురణకర్త గానీ, రచయితగానీ ప్రచురణ కాలేదంటున్నారు తప్ప వెలికి వచ్చిన అంశాలు వాస్తవమో కాదో చెప్పడం లేదు. ఇది మరింత విచిత్రం. పుస్తకం మార్కెట్లో అందుబాటులో లేకపోయినా అందులోని అనేక విషయాలు వెలికి వచ్చాయి. రాహుల్‌గాంధీ అయితే ఆ గ్రంథాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. ప్రచురితమా, కేవలం ముద్రితమా అన్న చర్చ జరుగుతోంది తప్ప అందులోని అంశాల మీద ప్రచురణ సంస్థ కానీ, రచయిత కానీ మాట్లాడడం లేదు. అంటే వీరు న్యాయ సూత్రాల ఆధారంగా మాట్లాడుతున్నారు.


