ఆహార భద్రత డొల్ల! – Visalaandhra


. ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్ల చెలగాటం
. మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు
. 28వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంకింగ్
. ఎఫఎసఓలు, ఏఎఫ్‌సీలు విజిటింగ్‌లకే పరిమితం
. 30 శాతం లైసెన్సులు లేకుండానే వ్యాపారం

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ అపహాస్యమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను కట్టడి చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాల్లో నాణ్యతలేని పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతుంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆహార భద్రత సూచీలో ఆంధ్రప్రదేశ్ 28వ స్థానానికి పడిపోవడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రతి ఫుడ్ సేఫ్టీ అధికారి నెలకు కనీసం 12 నమూనాలు సేకరించాలనే నిబంధన ఉన్నా, అది ఎక్కడా అమలు కావడం లేదు. గత 11 నెలల్లో ఒక్కో అధికారి 132 నమూనాలు తీయాల్సి ఉండగా, 40 మంది అధికారులలో కేవలం ఆరుగురు మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారు. జాతీయ స్థాయిలో సగటున 20 శాతం నమూనాలు కల్తీవని తేలుతుంటే, ఏపీలో మాత్రం అధికారులు కేవలం ఎనిమిది శాతమేనని రిపోర్టులు ఇస్తున్నారు. అంటే తనిఖీలు ఎంత మొక్కుబడిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పనిచేసే చోట ఉండాల్సిన అధికారులు సుదూర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ‘విజిటింగ’ అధికారుల్లా వచ్చి పోతున్నట్లు ఇటీవల మంత్రి నిర్వహించిన సమీక్షలో బట్టబయలైంది. మచిలీపట్నం, పల్నాడు, అన్నమయ్య, విశాఖ, కడప జిల్లాలకు చెందిన ఎఫఎసఓలు, చిత్తూరు, కర్నూలు ఏఎఫ్‌సీ¾లు తమ విధులకు గైర్హాజరవుతూ సొంత ప్రాంతాల నుంచే నెట్టుకొస్తున్నట్లు తేలింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, ఇకపై ముఖ ఆధారిత హాజరు ఉంటేనే జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నాలుగు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ వాహనాలను మూలన పడేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతలేని ఆహారం, పాలు వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. రాజమహేంద్ర వరంలో కల్తీ పాలు పదిమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. ఆహార పదార్థాల కల్తీ కారణంగా ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన పురస్క రించుకుని పరిశీలిస్తే పాల నమూనాల సేకరణ ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్న విషయం సుస్పష్టం అవు తోంది. కేంద్ర ప్రభుత్వం చివరిగా 2024, మార్చిలో ప్రకటించిన ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ 28వ స్థానంలో నిల్చింది. రాష్ట్ర ఆహార భద్రత శాఖ తన పనితీరును క్రమంగా మెరుగుపరుచుకొని ఈ ఏడాది డిసెంబరు నాటికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచే తొలి పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలని లక్ష్యంగా నిర్ణయించారు. పలువురు వ్యాపారులు సరైన లైసెన్సులు లేకుండానే ఆహార విక్రయాలు కొనసాగిస్తున్నారు. లైసెన్సులు ఉన్న చోట్ల కూడా నిబంధనలు పాటించక పోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. నగరాలు, పట్టణాల్లో వీధి ఆహారం వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిపై పర్యవేక్షణ తక్కువగా ఉంది. శుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, కలుషిత నీటితో వంటలు చేయడం వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. ఎఫఎసఎసఏఐ నిర్దేశించిన ప్రోటోకాల్ మేరకు తనిఖీలు జరగాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదు. కేసులు నమోదుచేయడంలోనూ మొహమాటాన్ని ప్రదర్శించడం వెనుక మామూళ్ల మహత్మ్యం పనిచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సురక్షిత ఆహారం తీసుకునే విషయంలో, తనిఖీల నిర్వహణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదిశగా దృష్టిసారించడం లేదు. వ్యాపారస్తులందరూ తప్పనిసరిగా ఫుడ్ లైసెన్సులు తీసుకుని తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ 30 శాతం మేర లైసెన్స్లు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. అయితే ఆహార కల్తీపై ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నా, ప్రజల సహకారం లేనిదే పూర్తిస్థాయి విజయం సాధ్యం కాదని, కల్తీని గమనిస్తే వెంటనే గళం విప్పాలని ప్రభుత్వం పిలుపునిస్తుంది. ఫిర్యాదులకు 1800 425 3857, 08645-297245 టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించింది. ప్రస్తుతం ‘అన్ సేఫ’ కేటగిరీలో ఉన్న శిక్షలు చాలా తక్కువగా ఉన్నాయని, అందుకే కల్తీ చేసేవారిలో భయం ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జైలు శిక్షా కాలాన్ని పెంచడం భారీ జరిమానాలు విధించడం, ఈ నిబంధనలను మార్చేలా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం, గుంటూరులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త ప్రయోగశాలలను ఏర్పాటు చేయనుంది. లైసెన్సింగ్ లో లోపాలను సరిదిద్దడంతో పాటు క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయడం, ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించడం, ఫిర్యాదు వ్యవస్థను బలోపేతం చేయడం ప్రజల్లో అవగాహన పెంచడంపై ఫుడ్‌సేఫ్టీ శాఖ దృష్టిసారించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *