. నాదర్గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే
. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే
. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’
. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు
. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం
విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని మామలు… ఇప్ప్పుడు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, మంత్రులపైనా కేసీఆర్ డైరెక్షన్లో హరీష్‌రావు, కేటీఆర్ చేస్తున్న అసత్య ఆరోపణలపై పొంగులేటి తీవ్రంగా స్పందించారు. సచివాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, సామెల్, బి.లక్ష్మారెడ్డి, శ్రీగణేష్, రాంమోహన్ రెడ్డి తదితరులతో కలిసి తనదైన శైలిలో బీఆరఎస్ పై విరుచుకుపడ్డారు. నాదర్గుల్, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ అంశాలపై మంత్రి ఆధారాలతో సహా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు.రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లో సర్వే నెంబర్ 613లో ఉన్న 373 ఎకరాల 13 గుంటలు… ప్రైవేటు భూమిగా, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ భూమిగా కోర్టుల్లో దీనిపై కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రైవేటు పారీ… మరోసారి ప్రభుత్వం గెలవడం, పైకోర్టులకు పోవడం, పోలీసు సహకారంతో కోర్ట్ డైరెక్షన్ తెచ్చుకోవడం ఆనాటి ప్రభుత్వంలో జరిగాయి. 2014లో యునైటెడ్ ల్యాండ్ మార్క్స్Ž, అల్ఫా ఎస్టేట్స్, ఒమెగా డెవలప్మెంట్స్ సంస్థలకు 613 సర్వే నెంబరులో భూమి రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా అని బీఆరఎస్ నేతలను నిలదీశారు. రిజిస్ట్రే షన్ చేసిన డాక్యుమెంట్లను 2016, సెప్టెంబర్ 24 న ఫైల్ నెంబర్ బి/1351/2/2021-1-1, 2021-2, 2021-3, 2011-3కు మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో కాదా అని నిలదీశారు. మీ ప్రభుత్వంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ జరిగితే ప్రస్తుత ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. గూగుల్ మ్యాప్ చూడండి ప్రతిదీ కనిపిస్తుందన్నారు. దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించి… దాన్ని తమ ప్రభుత్వంపై నిందలు మోపుతావా అని మండిపడ్డారు. ఆ భూమిపై మేమే కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నామని మంత్రి తెలిపారు. 2022లో ఎసఎల్పీ నెంబర్ 15415-2022లో వాళ్లు సుప్రీంకోర్టుకు పోతే మీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎందుకు కౌంటర్ వేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కౌంటర్ వేసింది మేమే అని స్పష్టం చేశారు. వట్టి నాగులపల్లి భూమి షా కుటుంబానికి సంబంధించిన పంచాయితీ… ప్రభుత్వానికి ఏం సంబంధం అని నిలదీశారు. కోర్టులో వివాదం ఉంది. కోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తే ప్రభుత్వం ఆ తీర్పుకు కట్టుబడి ఉం టుందన్నారు. కొత్వాల్గుడా విషయంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంపై బురదచల్లుతున్నారు. రాఘవ కన్ స్ట్రక్షన్ హైదరాబాద్ లో రేడియల్ రోడ్డు చేస్తోంది. తిరుమల కన్ స్ట్రక్షన్ మెటల్ సప్లై చేస్తోంది. 2007 నుంచే క్రషర్ నడచుకుంటోంది. అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజుకు తీసుకొని కుమార రాజు అనే వ్యక్తి క్రషర్ నడుపుకుంటున్నాడు. ఆ క్రషర్ ఒరిజినల్ గా కర్నూలులో రాఘవ కన్ స్ట్రక్షన్ది. పని అయ్యాక తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్లు దాని కొనుక్కున్నారని వివరించారు. రాఘవ కన్ స్ట్రక్షన్ మోచేతి నీరు తాగినోళ్లు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ, ఈ అబద్ధాల రావు, డ్రామా రావుకు బాగా తెలుసు అని ధ్వజమెత్తారు.
The post అసత్యాలు ఆపండి appeared first on Visalaandhra.


