విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎంపీడీవో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గ్రామంలో తలెత్తే త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు వంటి ఇతరత్రా ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే సోషల్ మీడియా గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డ్రైనేజీలు చెత్తతో పేరుకుపోయినా, పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిర్ణీత ప్రాంతాలకు రాకపోయినా లేదా వేసవి దృష్ట్యా ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఏర్పడితే వెంటనే సమాచారం అందిస్తే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా, రాత్రి సమయాల్లో గ్రామాల్లో ఎక్కడైనా వీధిలైట్లు వెలగకపోతే సంబంధిత ఏరియాను ఫోటో తీసి మెసేజ్ చేస్తే, మరుసటి రోజే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అక్కడ లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, సమస్యలు తెలిసిన వెంటనే పరిష్కరించడానికి యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని ఎంపీడీవో స్పష్టం చేశారు.


