యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తాబా ఖామేనీ


తెహ్రాన్: అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం మొజ్తాబా కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం మొజ్తాబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెళ్లడించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే… పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తాం’ అని పేర్కొంది. తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను సుప్రీం నేత ఆదేశించినట్లు తెలిపింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదన మేరకు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హోర్మూజ్‌ను తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని, దీంతో రెండు వారాల పాటు దానిపై ఎలాంటి దాడులు చేయమని స్పష్టంచేశారు. ఇరాన్‌తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ గడువు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హోర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగించడం, అమెరికా విధించిన ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేయడం, తమపై ఎలాంటి దురాక్రమణలకు పాల్పడకుండా ఉండటం వంటి 10 షరతులను ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు సానుకూలంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు తగ్గాయి. యుద్ధ ప్రభావం ఇంచుమించు అన్ని దేశాలు చవిచూశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *