ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra


సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న

న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగబద్ధ సంస్థగా గుర్తిస్తూ 1995లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ఎన్నికలంటే నిర్ణీత కాలవ్యవధుల్లో జరిగే ప్రక్రియ కాదని, దేశంలో రాజకీయ అధికారాన్ని నిర్మించే ఓ వ్యవస్థ అని తెలిపారు. ‘సకాలంలో ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రభుత్వాల మార్పు శాంతియుతంగా జరుగుతుందని స్పష్టంగా నిరూపితమైంది. ఆ ప్రక్రియపై నియంత్రణ కలిగి ఉండటమంటే… రాజకీయ పోటీకి సంబంధించిన పరిస్థితులపై నియంత్రణ కలిగి ఉండటమే’ అని జస్టిస్ నాగరత్న వివరించారు. రాష్ట్రాలను కేంద్రానికి లోబడే సంస్థలుగా చూడకూడదని, వాటికి సమాన ప్రతిపత్తి ఇవ్వాలని అన్నారు. రాజ్యాంగం కూడా రాష్ట్రాలను, కేంద్రాన్ని సమాన హోదా కలిగిన వ్యవస్థలుగానే పరిగణిస్తోందని చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *