విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం తెలగావీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాలని వారు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. తిరుమల వంటి పవిత్రక్షేత్రంపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.
అదే సమయంలో, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఒకవైపు ఆరోపణలు చేస్తూ, మరోవైపు బయటకు వచ్చిన అంశాలపై మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
తక్షణమే టీటీడీ పరిపాలనలో పారదర్శకత తీసుకురావాలని, వివాదాస్పద అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే టీటీడీ ప్రతిష్టను కాపాడాలంటే బీఆర్ నాయుడిని వెంటనే ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


