6నుంచి ‘పది’ మూల్యాంకనం – Visalaandhra


*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం
*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన

                           (విశాలాంధ్ర-చిత్తూరు)

మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెడుతూ, పారదర్శకతే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది.

ట్యాబ్ విధానంతో సాంకేతిక విప్లవం

గతంలో జవాబు పత్రాలను మాన్యువల్‌గా దిద్దేటప్పుడు మార్కుల లెక్కింపులో లేదా పోస్టింగ్ చేయడంలో చిన్నపాటి పొరపాట్లు దొర్లేవి. వీటిని పూర్తిగా నివారించేందుకు ఈసారి ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జవాబు పత్రాలను స్కాన్ చేసి, ఉపాధ్యాయులకు కేటాయించిన ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేస్తారు. దీనివల్ల ప్రతి ప్రశ్నకు వేసిన మార్కులు సాఫ్ట్ వేర్ ద్వారానే క్రోడీకరించబడతాయి. కూడికల్లో తప్పులు దొర్లే అవకాశం లేదు. మార్కుల పరిశీలన అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పూర్తవుతుంది.

677 మంది ఉపాధ్యాయులతో…

జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ఉన్నత పాఠశాలో జరిగే ఈ మూల్యాంకన ప్రక్రియలో మొత్తం 677 మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఇందులో చీఫ్ ఎగ్జామినర్లు 78 మంది, అసిస్టెంటు ఎగ్జామినర్లు 424 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 175 మంది ఉంటారు. మూల్యాంకనంలో స్పెషల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు. విద్యార్థుల జవాబు పత్రాలను అసిస్టెంటుల ఎగ్జామినర్లు మూల్యాంకనం చేస్తారు. వీటిని చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలన చేసిన తరువాత.. స్పెషల్ అసిస్టెంట్లు జబాబు పత్రాలరు స్కాన్ చేస్తారు. ఒకవేళ మార్కుల నమోదులో పొరబాట్లు జరిగితే… స్కాన్ లో ఖచ్చితమైన మార్కులు నమోదవుతాయి. వాటిని వెంటనే సెంట్రల్ సర్వరుకు అప్ లోడ్ చేస్తారు. ఈ మార్కులు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించనున్నారు. మూల్యంకనంలో ట్యాబ్ ల వినియోగం విద్యా వ్యవస్థను డిజిటల్ దిశగా ముందుకు తీసుకు పోవడానికి దోహద పడుతుంది.

పకడ్బందీ పర్యవేక్షణ

మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస వసతులు కల్పించారు. కేంద్రం లోపలికి సెల్‌ఫోన్లను అనుమతించరు. 24/7 సీసీ కెమెరాల నిఘాలో, పోలీసు బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు షిఫ్టుల వారీగా మూల్యాంకనం జరుగుతుంది.

త్వరితగతిన ఫలితాలు

ఈ డిజిటల్ విధానం వల్ల మూల్యాంకనం పూర్తయిన వెంటనే మార్కులు నేరుగా బోర్డు సర్వర్‌కు అనుసంధానం అవుతాయి. దీనివల్ల గతంలో మాదిరిగా డేటా ఎంట్రీ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా పదవ తరగతి ఫలితాలను గతంలో కంటే రికార్డు సమయంలోనే విడుదల చేసేందుకు మార్గం సుగమం కానుంది. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా, పొరపాట్లకు తావు లేకుండా చూడటమే ఈ నూతన విధానం ప్రధాన ఉద్దేశ్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *