వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..


యశోద హాస్పిటల్స్‌లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం

  • మెదడులో ఎలక్ట్రోడ్ల అమరికతో పార్కిన్సన్ బాధితులకు పునర్జన్మ
  • అత్యాధునిక సాంకేతికతతో నిలిచిన హైటెక్ సిటీ యశోద వైద్య బృందం
  • మందులు పనిచేయని దశలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఒక్కటే మార్గం
  • బాధితుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి సేవలు

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్, క్లినికల్ డైరెక్టర్ రాజేష్ అలుగోలు తెలిపారు. మంగళవారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తూ, దేశంలో లక్ష జనాభాలో సగటున 42 నుండి 60 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌కు చెందిన అశోక్ రెడ్డి, కాజీపేటకు చెందిన సంగీత పార్కిన్సన్ తీవ్రతతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చేరగా, నిపుణుల బృందం విజయవంతంగా డీబీఎస్ ప్రక్రియను పూర్తి చేసి వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చిందని వివరించారు. ఈ చికిత్సలో భాగంగా మెదడులోని నిర్దిష్ట భాగంలో ఎలక్ట్రోడ్‌లను అమర్చి, ఛాతీ వద్ద ఉండే చిన్న పరికరంతో అనుసంధానించడం ద్వారా మెదడు సంకేతాలను నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. ప్రారంభ దశలో మందులతో నయం చేయగలిగినప్పటికీ, మూడు నాలుగు ఏళ్ల తర్వాత వ్యాధి లక్షణాలు ముదిరినప్పుడు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన డీబీఎస్ చికిత్స అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని రాజేష్ అలుగోలు వివరించారు. గత మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ విధానం రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. సుమారు 2,000 పడకల సామర్థ్యంతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ అరుదైన, క్లిష్టమైన వ్యాధులకు సరసమైన ధరలోనే ఆధునిక వైద్యం అందిస్తోందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి ప్రతినిధులు సంతోష్ కుమార్, ఎస్.వి.వి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

The post వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *