హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ


అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు మాత్రమే ఏప్రిల్ 1, 2026 నుంచి హెచ్-1బీ పిటిషన్లు దాఖలు చేయడానికి అర్హులు. పిటిషన్ల దాఖలుకు కనీసం 90 రోజుల గడువు ఉంటుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. పిటిషన్‌తో పాటు లాటరీలో ఎంపికైనట్లు తెలిపే సెలక్షన్ నోటీసు కాపీని జతచేయాలి. ఈ ఏడాది నుంచి యూఎస్‌సీఐఎస్ కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా, అధిక నైపుణ్యాలు, అధిక వేతనాలు ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఃవెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ః ప్రవేశపెట్టింది. పిటిషన్ దాఖలు సమయంలో రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న పాస్‌పోర్ట్, ఉద్యోగ వివరాలు సరిపోవాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త వెర్షన్ ఫారం ఐ-129 (02/27/26 నాటిది) మాత్రమే స్వీకరిస్తామని తెలిపింది.

అంతేకాకుండా, 2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసే కొన్ని ప్రత్యేక హెచ్-1బీ పిటిషన్లకు అర్హత షరతుగా అదనంగా 1,00,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఏజెన్సీ పేర్కొంది.

ప్రతి ఏటా కాంగ్రెస్ 65,000 హెచ్-1బీ వీసాలను కేటాయిస్తుండగా, అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి అదనంగా 20,000 వీసాలు అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లోని సంస్థలు ఈ వీసా ప్రోగ్రామ్‌పై ఎక్కువగా ఆధారపడతాయి. ఏటా హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయుల వాటా గణనీయంగా ఉంటోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *