పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం


​ -​ రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు

ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం

​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది.

ముగిసిన ఐదేళ్ల ప్రస్థానం

గత ఐదేళ్ల కాలంలో పల్లెల్లో అనేక రాజకీయ, పరిపాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 1,044 పంచాయతీల సర్పంచులు రేపు సాయంత్రం తమ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. సచివాలయ వ్యవస్థ, నిధుల కొరత వంటి సవాళ్ల మధ్య గ్రామ వికాసం కోసం వారు చేసిన కృషి నేటితో ఒక ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్లు అన్ని పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే ప్రక్రియను పూర్తి చేశారు.

అధికారుల చేతుల్లోకి పల్లె పరిపాలన

రేపు (ఏప్రిల్ 2) సాయంత్రం లోపు సర్పంచులు తమ ‘చెక్ పవర్’ బాధ్యతలను, రికార్డులను పంచాయతీ కార్యదర్శులకు లేదా నియమించబడిన ప్రత్యేక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఎల్లుండి (ఏప్రిల్ 3) నుండి మండల స్థాయి అధికారులైన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఇతర గెజిటెడ్ హోదా ఉన్న మండల అధికారులు ప్రత్యేక అధికారులుగా గ్రామ పరిపాలనను పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి అత్యవసర సేవల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా చూడటమే ఈ అధికారుల ప్రాధాన్యత కానుంది.

వేడెక్కిన పల్లె రాజకీయం

పదవీకాలం ముగుస్తున్నప్పటికీ, కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో గ్రామాల్లో మళ్లీ తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న నేతలు ఇప్పటికే అంతర్గత చర్చలు, వ్యూహరచనలు మొదలుపెట్టారు. ఏదేమైనా, 1,044 పంచాయతీల్లో రేపటితో సర్పంచుల పాలన ముగిసి, అధికారుల పాలన ప్రారంభం కానుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

The post పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *