విశాలాంధ్ర -అనంతపురం టౌన్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాదాల పట్ల జిల్లా అధికారులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి ప్రమాదాల పట్ల, ఎన్ని రకాల అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, వాటిని ఆర్పే పద్ధతులు గురించి, కిచెన్ సేఫ్టీ గురించి, కార్యాలయాల్లో సేఫ్టీ, ఎలక్ట్రికల్ ఫైర్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఇటీవల హెచ్ఎన్ఎస్ఎస్, ఇతర కెనాల్స్ నీటిలో పడి కొందరు కొట్టుకొనిపోతున్నారని, వాటిపై దృష్టి పెట్టడం జరిగిందని, ఇందులో భాగంగా లైఫ్ జాకెట్ల గురించి, ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్, వాటర్ బబుల్స్ ఎలా వాడాలి, ఎండిపోయిన కొబ్బరికాయలు ఎలా ఉపయోగించాలి, పారుతున్న నీటి నుంచి ఎలా బయటపడాలి, తదితర అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, పద్మావతి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, సమగ్ర శిక్ష ఏపిసి శైలజ, డిసిఓ అరుణకుమారి, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, వయోజన విద్య ఉపసంచాలకులు వెంకటేశ్వర్లు, ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, ఎల్డియం నరేష్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ ఏడి రాజశేఖర్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ యుగేశ్వరిదేవి, ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


