విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) తలారి నాగన్న శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పుల్లలరేవు, గొందిరెడ్డిపల్లి గ్రామాల వి.ఆర్.ఏగా పని తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర మండల కార్యాలయాల సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, ప్రజలతో మమేకమై ఉంటూ మృదుస్వభావిగా మంచి గుర్తింపు పొందారు. విధుల నిమిత్తం గురువారం ఉదయం కూడా అధికారులతో కలిసి పుల్లలరేవు పొలాల రీసర్వే ప్రక్రియలో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఇబ్బందికి గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. నాగన్నకు ముగ్గురు కూతుళ్లు ఉండగా భార్య దాదాపు 10 ఏళ్ల క్రితమే మరణించింది. తహశీల్దార్ బి.విజయకుమారి ఆదేశాల మేరకు మండల సర్వేయర్ రామాంజనేయులు, ఆర్ఐ కరుణాకర్ కారుణ్య ఆర్థిక సహాయం కింద రూ.25వేలు నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. నాగన్న మృతదేహానికి సర్వేయర్, ఆర్ఐతో పాటు వి.ఆర్.ఓ లక్ష్మీనారాయణచౌదరి, సర్వేయర్ సాయి, విఆర్ఎల సంఘం మండల
అధ్యక్షుడు తలారి కర్ణ, విఆర్ఎలు వెంకటేష్ క్రాంతికుమార్, బాలరాజు, దుర్గేష్, బాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆయన మృతి పట్ల గ్రామస్థులు, తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


