విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక తిక్కయ్య స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కల్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించగా, ముత్యాల తలంబ్రాలతో పాటు పూజా సామగ్రిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, ఈసారి తమ చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందని నార్పల సత్యనారాయణ రెడ్డి తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో అమర్, భారత్, భాస్కర్ నాయుడు, చికెన్ గోపాల్, గవ్వల ప్రవీణ్ కుమార్, గవ్వల సాయికృష్ణతో పాటు గ్రామ పెద్దలు, భక్తులు, వైఎస్ఆర్‌సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.


