‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా…
అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?” అన్నట్టుగా నిర్భయంగా అక్రమ రవాణా కొనసాగుతుండటం గమనార్హం. ముఖ్యంగా శ్రీరామనవమి పండగను అవకాశంగా తీసుకుని అధికారులు గైర్హాజరయ్యే సమయాల్లో ఈ దందా మరింత ఊపందుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అధిక వేగంతో దూసుకెళ్తున్న ఎర్ర మట్టి ట్రాక్టర్లు ప్రజలకు ప్రాణహానిగా మారుతున్నాయి. రహదారులు దాటేందుకు విద్యార్థులు, మహిళలు, వృద్ధులు భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ట్రాక్టర్లు నార్పల మండల కేంద్రం వరకు బహిరంగంగానే రాకపోకలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ అక్రమ రవాణాపై వార్తలు వెలువడినా, చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు, కిందిస్థాయి సిబ్బంది మట్టి వ్యాపారులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక తనిఖీలు చేపట్టి అక్రమ తవ్వకాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.


