విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ ఇళ్లు లేని అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని మోస పూరితమైన హామీలను ఇచ్చి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. తక్షణమే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఎస్ఓ వెంకటేశ్వర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజి, రవి, అగ్గి రాముడు, మాబు వలి, వీరన్న, నాగప్ప, రాము తదితరులు పాల్గొన్నారు.
The post ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి appeared first on Visalaandhra.


