న్యూయార్క్ విమానాశ్రయంలో ఘటన
న్యూయార్క్: రన్‌వేపై వెళ్తున్న విమానం ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఘటన అమెరికా లోని న్యూయార్క్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా… మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారు. న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సీఆర్జే-900… లాగార్డియా విమానాశ్రయంలోని నాలుగో రన్‌వేపై దిగింది. అక్కడి నుంచి టాక్సీ యింగ్ వైపు వెళ్తుండగా రన్‌వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో విమానం ముందు భాగం పైకి లేచి పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రమాద సమయంలో విమానం గంటకు 24 మైళ్ల వేగంతో ప్రయాణించినట్లు ఫ్లైట్రాడార్ 24 డేటా వెల్లడించింది. ఘటనకు కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు రన్‌వేపై వెళ్తున్న వాహ నాన్ని అక్కడే ఆగాలంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఇదే విమానాశ్రయంలో దిగిన యునైటెడ్ 737 మ్యాక్స్ విమానంలో ఎమర్జెన్సీ తలెత్తింది. క్యాబిన్లో ఘాటు వాసన రావడంతో విమాన సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. విమానం వద్దకు వచ్చేందుకు ఆ వాహనం రన్‌వే దాటుతుండగా ఎయిర్ కెనడా విమానం ఢీకొట్టింది.


