వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్), తాత్కాలిక వీసాల సంఖ్య గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సుమారు 11 శాతం తగ్గింది. ఈ వీసాలు ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే అమెరికాలో నివసిస్తున్న పౌరుల కుటుంబ సభ్యులకు జారీ చేస్తారు. వీటిలో పర్యాటక వీసాలను లెక్కలోకి తీసుకోలేదు. అయితే వాటి జారీ కూడా తగ్గినట్లు తెలిసింది. ప్రత్యేకించి భారత్, చైనా దేశాలకు చెందిన అభ్యర్థుల విషయంలో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులకు జారీ చేసిన వీసాల సంఖ్య 2024తో పోల్చితే సుమారు 84 వేల మేర తగ్గింది. అమెరికాకు వెళ్లే వారి తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. విద్యార్థి వీసాల విషయానికి వస్తే… 2024 జనవరి నుంచి ఆగస్టు మధ్యకాలంలో అమెరికా ప్రభుత్వం 3.44 లక్షలకుపైగా వీసాలు జారీ చేసింది. అయితే 2025లో అదే కాలంలో ఈ సంఖ్య 2.38 లక్షలకు పడిపోయింది. అంటే లక్షకు పైగా వీసాలు తగ్గినట్టే. ఇది అమెరికాలో చదవాలని ఆశపడుతున్న విద్యార్థులకు పెద్ద షాక్‌గా మారింది. అలాగే వ్యాపార, పర్యాటక వీసాలు కూడా తగ్గుముఖం పట్టాయి. 2025 తొలి ఎనిమిది నెలల్లో ఇవి సుమారు 3.4 శాతం తగ్గి దాదాపు 2 లక్షల మేరకు పడిపోయాయి. అమెరికా సందర్శనకు వెళ్లే వారి సంఖ్యపై కూడా ఈ మార్పు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. కుటుంబ ప్రాధాన్య వీసాల్లో కూడా భారీ కోత విధించారు. అమెరికా పౌరుల పెద్ద పిల్లలు, సహోదరులకు ఇచ్చే ఈ వీసాలు 27 శాతం తగ్గిపోయాయి. మొత్తంగా చూస్తే 44 వేలకుపైగా వీసాలు తగ్గాయి. కుటుంబాల కలయికకు ఇది అడ్డంకిగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సముద్ర, విమాన సిబ్బందికి ఇచ్చే వీసాలు కూడా తగ్గాయి. ఆ విభాగంలో సుమారు 30,876 వీసాలు తగ్గాయి. అలాగే సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలకు సంబంధించిన ఎక్స్చేంజ్ వీసాలు కూడా 29,594 మేర తగ్గాయి. అమెరికాలో అనుభవం సంపాదించాలని భావించే యువతకు ఇది నిరాశ కలిగించే పరిణామమే. ఇక నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన వీసాలు కూడా దాదాపు సగానికి పడిపోయాయి. 2024 తొలి ఎనిమిది నెలల్లో 37,229 వీసాలు జారీ కాగా, 2025లో ఈ సంఖ్య 18,894కు తగ్గింది. ఈ పరిణామాలపై వైట్‌హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ స్పందిస్తూ, అమెరికా ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశ పౌరుల భద్రత, ఉపాధి అవకాశాలను కాపాడేందుకేనని తెలిపారు.


