గ్రామ కంఠాల గోస – Visalaandhra


నాడు అంగీకరించి… నేడు విచారణేంటి?
అధికారుల ద్వంద్వ వైఖరిపై నిరసన
గొంతు నొక్కేందుకే ‘రీ-సర్వే’ అంటున్న రాజధాని రైతులు

విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు త్యాగం చేసిన అమరావతి రైతులపై ప్రభుత్వం మరోసారి తన ప్రతాపం చూపుతోంది. జీఓ నంబర్ 50 రూపంలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించి… భూములిచ్చిన రైతులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే సర్వేలు పూర్తి చేసి… అథారిటీ తీర్మానాల మేరకు ఇచ్చిన మినహాయింపులను ఇప్ప్పుడు ‘అక్రమాలు’గా చిత్రీకరిస్తూ రీ-సర్వేకు ఆదేశించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేల ఎకరాల భూములను రాజధాని కోసం ధారపోసిన తమను… ‘భూ ఆక్రమణదారులు’గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 భూసమీకరణ సమయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసెంబర్ 8, 2014 నాటికి గ్రామ కంఠాలకు ఆనుకుని ఉన్న గేదెల పాకలు, పొగాకు బ్యారన్లు, ఇతర నిర్మాణాలను పూలింగ్ నుండి మినహాయిస్తామని అథారిటీ స్వయంగా తీర్మానం చేసింది. 2016-18 మధ్య కాలంలో అధికారులే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సుమారు 510 మంది రైతులకు గ్రామకంఠాల కింద భూములు వదిలేశారు. జరీబు కంటే మెట్ట ప్రాంతాల్లో బ్యారన్లు ఎక్కువగా ఉండటంతో… ఆ రైతులకు కొంత అదనపు స్థలం లభించింది. ఇది అప్పట్లో ప్రభుత్వం అంగీకరించిన అంశమే. పాత నిర్ణయాలను తిరగదోడుతూ 10 సెంట్ల కంటే అదనపు భూమి పొందిన వారిని విచారించాలని జాయింట్ కలెక్టర్ కమిటీని పంపడం అంటే… రైతులు భూములు కాజేశారనే తప్ప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపడమేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరపాలని జీఓ ఇవ్వడం వెనుక రాజకీయ కోణం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జేఏసీ నేతృత్వంలో రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని, త్రీ-మెన్ కమిటీని కలిశారు. గతంలోనే మొదటి దశ, రెండో దశ అంటూ గ్రామ కంఠాలను విస్తరించి మినహాయింపులు ఇచ్చారు. ఇప్ప్పుడు మళ్లీ సర్వేలు చేయడం అంటే పాత గాయాలు రేపడమేనని రైతులు అంటున్నారు. విచారణకు తాము వ్యతిరేకం కాదని, కానీ పూలింగ్ ప్రక్రియ అంతా ముగిసిపోయి… ప్లాట్లు కేటాయించిన తర్వాత ఇప్ప్పుడు పాత రికార్డులు తిరగదోడటం అంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయడమేనని రైతులు స్పష్టం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని అడిగితే విచారణపేరుతో నోరు మూయించే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని వాపోతున్నారు. రైతులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజధాని కోసం సర్వం అర్పించిన రైతులను గౌరవించడానికి బదులు… రికార్డుల పేరుతో వేధించడం ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నామంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *