. యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
. ఇది స్టీల్‌ప్లాంట్ కాదు…స్టీల్ సిటీకి శంకుస్థాపన
. దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ప్రభుత్వ ప్రణాళిక
. ఏఎం`ఎనఎస్ భూమి పూజలో సీఎం చంద్రబాబు
. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధి: కుమారస్వామి
విశాలాంధ్ర- పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా): పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తిరుగులేని వేదికని, ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకా పల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద రూ.1.35 లక్షల కోట్లతో 8.2 ఎంపీటీఏ సామర్థ్యంతో ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేయబోయే ఉక్కు పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు, పరిశ్రమ ప్రతినిధులతో కలిసి చంద్రబాబునాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో నక్కపల్లి కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. ప్రజాపోరాటం ఫలితంగా విశాఖ ఉక్కు ఏర్పడిందని, ఇక్కడ ఏర్పాటు చేసే ఉక్కు పరిశ్రమ అభివద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశ ఉక్కు రంగంలో ఉన్నతస్థాయిలో నిలిచిన ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో నక్కపల్లి ప్రాంతం తిరుగులేని ఉక్కుశక్తిగా మారుతుందని స్పష్టంచేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి నారా లోకేశ్‌కు, పరిశ్రమ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులను సీఎం అభినందించారు. 2028 డిసెంబర్ నాటికి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమ కోసం నాలుగు లైన్ల రోడ్డు వేస్తారని, పైప్‌లైన్ల ద్వారా ముడి ఇనుము తెస్తారని, యువత కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి, పరిశ్రమల ఏర్పాటు ద్వారా సంపద సృష్టించి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, అందులో భాగంగానే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ప్రజలకు అందించామన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ కాలంలో రూ.20.30 లక్షల కోట్ల్ల పెట్టుబడులు వచ్చాయని, రాబోయే మూడేళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. విశాఖపట్టణాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్నామని, రేర్ మినరల్ హబ్‌గా ఈ నగరం తయారు కాబోతున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఏర్పాటవుతున్న ఉక్కు పరిశ్రమలో స్థానిక, జిల్లా, రాష్ట్రం ప్రాధాన్యతగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమ అధినేతలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు పాలనలో ఉన్నాయని, తద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. విజనరీ నాయకుడు చంద్రబాబు అయితే… తండ్రికి తగ్గ తనయుడు, కార్యదీక్ష ఉన్న వ్యక్తి నారా లోకేశ్ అని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే… అది కేవలం చంద్రబాబునాయుడు దార్శనికతను చూసేనన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని విడినాడిన పరిశ్రమలు… కూటమి ప్రభుత్వంలో తిరిగి వస్తున్నాయన్నారు. రూ.1.35 కోట్లతో ఏర్పాటవుతున్న ఉక్కు పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు రావడం శుభపరిణామమన్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2200 ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ పారిశ్రామికంగా ఎదిగేందుకు ఇదో చారిత్రక ఘట్టమన్నారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఒక భరోసాగా ఉందన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఒక్క జూమ్ కాల్‌తో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు యాజమాన్యం ముందుకు వచ్చిందన్నారు. 18 నెలల్లో అన్ని రకాల అనుమతులు పొంది శంకుస్థాపన చేశారని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాబోయే రోజుల్లో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పరిశ్రమల గేట్‌వేగా పాయకరావుపేట మారుతుందన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే పారిశ్రామకవేత్తలు పరిశ్రమలు పెడుతున్నారని, రైతులు భూములు ఇస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలతో వలసలు తగ్గిపోతాయని, ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు ఉపాధి పేరుతో వలసలు రావడం ప్రారంభమవుతుందని అన్నారు. ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిత్తల్, సీఈఓ ఆదిత్య మిత్తల్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, సామర్థ్యం, ఉపాధి అవకాశాల గురించి వివరించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ¾ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్కష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
The post పరిశ్రమలకుఏపీ సరైన వేదిక appeared first on Visalaandhra.


