ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయం- సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ


మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం:రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గుతున్న ఈ కాలంలో, వచ్చే తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా జీవించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.సోమవారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో దివంగత నేత హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. పెద్దాయన భార్య లక్ష్మీదేవి, కుమారులు మారుతి చౌదరి, ఉదయ భాస్కర్ చౌదరి, వీరేశ్ తదితరులను కలసి సానుభూతి తెలిపారు.భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున సంపూర్ణ సంతాపాన్ని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై సేవలు అందించిన నాయకుడిగా హనుమంతరాయ చౌదరి గుర్తింపు పొందారని చెప్పారు.తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయనతో కలిసి అనేక పోరాటాలు చేసినట్లు రామకృష్ణ గుర్తుచేశారు. నైతిక విలువలకు కట్టుబడి చివరి వరకు ప్రజాసేవలో నిలిచిన హనుమంతరాయ చౌదరి, యువతకు ఆదర్శప్రాయమైన రాజకీయ జీవితం గడిపారని అన్నారు.రైతు మనస్తత్వంతో ముందుకు సాగిన ఆయన, దశాబ్దకాలం పాటు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారని, ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని తెలిపారు.హనుమంతరాయ చౌదరి చేసిన సేవలను గుర్తుగా, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని చెప్పారు.ఈ ప్రాంతంలో అందరికీ దగ్గరగా జీవించిన హనుమంతరాయ చౌదరి జీవితం నేటి యువతకు మార్గదర్శకమని రామకృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదర్శులు నరసింహులు, శ్రీనివాస్ నాయక్, సెట్టూరు మండల కార్యదర్శి తిమ్మరాయుడు, కళ్యాణదుర్గం మండల కార్యదర్శి ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *