ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా (Vizianagaram district)లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది (Fire breaks out in a private bus). అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున రామభద్రపురం మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… ఆరెంజ్ ట్రావెల్స్ (Orange Travels)కు చెందిన బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరికి వెళ్తోంది. ఈ క్రమంలో రామభద్రపురం మండలం తారాపురం గ్రామ సమీపంలోకి రాగానే బస్సు వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో నిప్పురవ్వలు చెలరేగి బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ దశరథ్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దించేశాడు.ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.


