10 కీలక హామీలతో విడుదల మమత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలకు అధికార టీఎంసీ ముందు నుంచి దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి అందరినీ అలోచనలో పడేసింది. అదే క్రమంలో శుక్రవారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ప్రతి ఇంట్లో ఆనందం నింపాలనే ఆశయంతో పనిచేస్తామని పేర్కొంటూ 10 కీలక హామీలతో పార్టీ మ్యానిఫెస్టోను ఆమె విడుదల చేశారు. సంక్షేమానికి, మహిళాభ్యుదయానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, వైద్య సేవలతోపాటు యువతకు వరాలు ప్రకటించారు. ‘లక్ష్మీ భండార్ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు నెలకు రూ.1500, ఎస్సీ/ఎస్టీలకు రూ.1700 చొప్ప్పున అందజేస్తాం. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.1500 సాయం అందిస్తాం. రాష్ట్రంలోని పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ఈ-లెర్నింగ్ సదుపాయాలు కల్పిస్తాం. రూ.30వేల కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశ పెడతాం. ప్రతి కుటుంబానికీ శాశ్వత ఇంటి నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటి సరఫరా అందేలా చూస్తాం’ అని మమత హామీలు గుప్పించారు. ప్రజల గడప వద్దే ఆరోగ్య సేవలు అందించే “ద్వారే చికిత్స” పథకం కింద వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
అన్ని మతాల వారూ సమానమే: మమత
పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఎనఆర్సీ, జనగణన పేరుతో ప్రజల పౌరసత్వాన్ని తొలగించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. మేనిఫెస్టో విడుదల అనంతరం ఆమె మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సహకరించేలా కేంద్రం, ఈసీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణకు ప్లాన్ చేస్తున్నాయన్నారు. తాను విభజన రాజకీయాలు చేయడంలేదని, అన్ని మతాల ప్రజలూ తనకు సమానమేనని తెలిపారు. రాంష్ట్రంలో మరింతగా శాంతి, సమానత్వాలు పెంపొందించాలన్నారు.


