లండన్: బ్రిటన్ స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని రకాల వీసా రుసుములు పెరగనున్నాయి. ఈ మేరకు బ్రిటన్ హోమ్ ఆఫీస్ ప్రకటించింది. దీంతో విదేశీయులపై సుమారు ఆరు శాతం నుంచి ఏడు శాతం నుంచి వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది. గతంలో 524 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్ప్పుడు 558 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,814) పెరిగింది. మూడేళ్ల కాలపరిమితిగల వర్క్ వీసా రుసుము 769 పౌండ్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.96,466) నుంచి 819 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,02,470) చేరింది. మూడేళ్లకు పైబడిన వీసా దరఖాస్తుల రుసుము 1,519 పౌండ్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,90.550) నుంచి 1,618 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2,02,437) పెరిగింది. ఆరు నెలల పర్యాటక వీసా చార్జీ 127 పౌండ్ల నుంచి 135 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,935 నుంచి రూ.16,890)కు పెరుగగా, స్పాన్సర్ లైసెన్స్ ఫీజులు, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ చార్జీలను బ్రిటన్ సవరించింది. ఏప్రిల్ 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే వారికి కొత్త చార్జీలు వర్తించవు. స్పాన్సర్ లైసెన్స్ ఫీజుల పెంపుతో బ్రిటన్ కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి వెనుకాడతాయన్న ఆందోళనలు ఉన్నాయి.


