పెట్రోలు ధర రూ.2.35 పెంపు – Visalaandhra


న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ సర్కారు పెట్రోలు ధరలు పెంచేసింది. ప్రీమియం పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు ధర పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధర పెంచాయి. సవరించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో మూడు రకాలుగా పెట్రోల్ లభిస్తోంది. ఒకటి సాధారణ పెట్రోల్, మరొకటి ప్రీమియం. ఇది కాకుండా హై ఆక్టేన్ ప్రీమియం అనే మూడో రకం పెట్రోల్ కూడా ఉంది. మెరుగైన ఇంజిన్ పనితీరు, మైలేజ్ కోసం వాహనాల్లో ప్రీమియం పెట్రోల్ ఉపయోగిస్తారు. ప్రస్తుత ధరల పెంపు హై-ఆక్టేన్, ప్రీమియం పెట్రోల్ వాడే వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. బీపీసీఎల్ స్పీడ్, హెచ్‌పీసీఎల్ పవర్, ఐఓసీఎల్ ఎక్స్‌పీ95 పేర్లతో ఈ ప్రీమియం పెట్రోల్ విక్రయిస్తాయి. పెట్రోల్ గ్రేడ్‌ను దాని ఆక్టేన్ విలువ ఆధారంగా వర్గీకరిస్తారు. భారత్‌లో సాధారణ పెట్రోల్ ఆక్టేన్ విలువ 87 కాగా, అదే ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ విలువ 91గా ఉంది. హై ఆక్టేన్ కలిగిన ఇంధనం ఎక్కువ కంప్రెషన్ రేషియో కలిగి ఉంటుంది. దీని ఫలితంగా వాహనం ఇంజిన్‌ను స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ ఇంధనం తీసుకోదు. కార్బన్‌పై తక్కువ ప్రభావం చూపుతుంది. శక్తిమంతమైన ఇంజిన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, బైక్‌లు, సూపర్ కార్లు మొదలైన వాటికి ప్రీమియం పెట్రోల్ వినియోగిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *