ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధపడుతున్న సౌదీ
ఖతార్: ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు బుధవారం అర్ధరాత్రి దాడులు జరిపింది. తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా దాడులు చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీస్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. దీంతో అత్యవసర బృందాలను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు యత్నాలు మొదలుపెట్టింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. రస్ లాఫాన్ గ్యాస్ క్షేత్రం నుంచి భారత్ అత్యధికంగా ఫర్టిలైజర్స్, సీఎన్‌జీ, పీఎన్‌జీ అవసరాల కోసం ఆధారపడుతుంది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో 47శాతం ఖతార్ నుంచే లభిస్తుంది. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ స్పందిస్తూ ఇరాన్ క్షిపణి దాడుల్లో పెద్ద సంఖ్యలో గ్యాస్ కేంద్రాల్లో నిప్ప్పులు చెలరేగి దెబ్బతిన్నట్లు వెల్లడించింది. మరోవైపు చమురు ధరలు ఈ దాడుల తర్వాత 110 డాలర్లకు చేరాయి.
అవసరమైతే సైనిక చర్యలు: సౌదీ
యూఏఈలోని అత్యంత కీలకమైన బాబ్ ఆయిల్ ఫీల్డ్‌పై ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతోపాటు హబ్‌షాన్ గ్యాస్ కాంప్లెక్స్‌ను కూడా లక్ష్యంగా చేసుకొంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రం. దీంతో యూఏఈ ప్రభుత్వం ఇక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. యూఏఈ సమీపంలో నౌకపై దాడి జరిగింది. యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని వెల్లడించింది. సౌదీ అరేబియా కూడా అంతకుముందు 8 బాలిస్టిక్ మిసైల్స్‌ను అడ్డుకొన్నట్లు వెల్లడించింది. “అవసరమైతే సైనిక చర్యను తీసుకొనే హక్కు ఉంది” అని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ హెచ్చరికలు జారీ చేశారు.
పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని నాశనం చేస్తా: ట్రంప్
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి విషయంలో ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమాయకపు ఖతార్‌పై ఇరాన్ తెలివి తక్కువగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇదే కొనసాగితే ఇజ్రాయెల్ సాయం ఉన్నా, లేకపోయినా…తాము ఇరాన్‌పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు. తాను ఆ స్థాయి హింస, వినాశనాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఖతార్ ఎలఎన్‌జీపై మరోసారి దాడి చేస్తే మాత్రం ఏమాత్రం సహించనని ట్రంప్ హెచ్చరించారు.


