వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు


పట్టు కోసం బీజేపీ వ్యూహాలు
ప్రతి వ్యూహాలతో దూకుడు మీదున్నతృణమూల్

కోల్‌కతా: ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భాజపా మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో తలమునకలవుతున్నాయి. పట్టు నిలబెట్టుకోవడానికి తణమూల్ కాంగ్రెస్, పట్టు సాధించడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కమలదళం మరోసారి ప్రధానంగా హిందుత్వ ఎజెండాతో బరిలో దిగుతోంది. ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుందంటూ సీఎం మమతకు ముందునుంచీ పేరుంది. దిఘాలో కొత్తగా నిర్మించిన జగన్నాథ్ ఆలయం గురించి తృణమూల్ నేతలు ప్రచారంలో తరచూ ప్రస్తావిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు- బెంగాల్‌ను మరో ఐదేళ్లపాటు పాలించబోయేది ఎవరో తేల్చడానికి మాత్రమే కాకుండా, ఆ రాష్ట్రం విషయంలో ఎవరి సిద్ధాంతానికి ప్రజామోదం ఉందో నిర్ధారించబోతున్నాయి.
జాతీయ వాద ప్రచారంతో బీజేపీ…
ఉత్తర బెంగాల్‌లో బీజేపీకి మంచి పట్టుంది. 2019 పార్లమెంటు ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ పట్టు సాధించింది. నాటి ఎన్నికల్లో ఉత్తర బెంగాల్‌లోని 8 పార్లమెంటు స్థానాల్లో ఏడు కమలనాథుల ఖాతాలోనే చేరాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్‌లోని 54 సీట్లలో 30 చోట్ల కాషాయ పార్టీ గెలుచుకుంది. రాష్ట్రంలో భాజపా మనుగడకు ఆ ప్రాంతం వెన్నెముకగా నిలుస్తోంది. ‘మదర్సాల గురించి మాత్రమే తృణమూల్ ఆలోచిస్తుంది. మన పిల్లల భవిష్యత్తు గురించి దానికి పట్టింపు లేదు. ఆ పార్టీ పాలనలో బెంగాల్ అభివృద్ధి చెందదు’ అని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా పదేపదే చెబుతున్నారు. హిందువులను పూర్తిగా తమవైపు తిప్ప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. భాష, సాహిత్యం వంటి అంశాల్లో జాతీయవాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. బెంగాలీ బహుళత్వానికి చొరబాటుదారుల వల్ల తీవ్ర నష్టం కలుగుతోందని చెబుతోంది. ఓబీసీ కోటా ప్రయోజనాల్లో ముస్లింలకు అనుచిత లబ్ధి చేకూరుతోందని ఆరోపిస్తోంది. స్థానిక అగ్రవర్ణ వర్గమైన భద్రలోక్‌తో పాటు అణగారిన వర్గాలైన రాజ్‌బోగ్షీలు, మతువాలు, నామశూద్రులు, ఆదివాసీ తెగలు, గూర్ఖాల మద్దతును పొందడంపై కమలదళం దృష్టిపెట్టింది.
బీజేపీ హిందుత్వ ఎజెండా తణమూల్‌కు అనుకూలించే అవకాశం…
బీజేపీ హిందుత్వ ఎజెండా తృణమూల్‌కు అనుకూలించవచ్చని కొంత మంది రాజకీయ పరిశీలకుల భావిస్తున్నారు. ‘దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తొలిసారిగా బెంగాల్‌లోనే కేంద్ర అమలు చేయించింది. ఆ చట్టం ముస్లింలపై వివక్ష చూపేలా ఉంది. దానికి వ్యతిరేకంగా ముస్లింలు ఏకమైతే…తృణమూల్ గెలుపు తేలికవుతుంది’ అని కూచ్‌బిహార్‌కు చెందిన ప్రబీర్ మజుందార్ చెప్ప్పుకొచ్చారు. దక్షిణ బెంగాల్‌తో పాటు రాష్ట్ర రాజధాని నగరమైన కోల్‌కతాలో తృణమూల్‌కు గట్టి పట్టుంది. ముఖ్యంగా కోల్‌కతా వ్యాప్తంగా ప్రచారంలో అధికార పార్టీ దూసుకెళ్తోంది. ‘ఎంత దాడి చేసినా తలొగ్గబోం… బెంగాల్ మళ్లీ గెలుస్తుంది’ అన్న నినాదాన్ని తృణమూల్ నాయకులు ప్రజల్లోకి ధీమాగా తీసుకెళ్తున్నారు. కోల్‌కతా వీధుల్లో బీజేపీ ప్రచారం కూడా చాలా తక్కువగానే కనిపిస్తోంది. కాషాయ పార్టీ జాతీయవాద ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మమత దూకుడు ప్రదర్శిస్తున్నారు. బెంగాల్ చరిత్ర, ఆచార వ్యవహారాలు, ఇక్కడి సాంస్కృతిక దిగ్గజాల గురించి వారికి బొత్తిగా అవగాహన లేదని ఎద్దేవా చేస్తున్నారు.

The post వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *