విశాలాంధ్ర- హైదరాబాద్ : నల్లగొండ జిల్లాపై చిన్న చూపు కూడకుండా రైతాంగానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు జీవనాడి అయిన ఎసఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనే భ్రమలో గత ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. దీనివల్ల నల్లగొండ జిల్లాలోని ఎసఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణవెల్లం వంటి కీలక ప్రాజెక్టులు మూలన పడ్డాయని మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ టన్నెల్ పనుల్లో కేవలం కొన్ని కిలోమీటర్ల తవ్వకం మాత్రమే మిగిలి ఉందని, దానిని పూర్తి చేయడంలో ప్రభుత్వం కాలయాపన వల్ల లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “ఒక గ్రామానికి వెళ్లాను. అక్కడ భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయి. తాగునీటికి కూడా కటకటలాడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న తరుణంలో నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. ఒక్కో గ్రామంలో 50కి పైగా ట్రాక్టర్ల ద్వారా రూ.1500 నుంచి రూ.2000 చెల్లించి నీటిని కొనుగోలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రైతులకు వచ్చింది” అని నెల్లికంటి సభ దృష్టికి తెచ్చారు. ఎసఎల్బీసీ టన్నెల్ పనులను వెంటనే పూర్తి చేసి, రాబోయే సీజన్ నాటికి సాగునీరు అందించాలన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి మునుగోడు, నల్లగొండ మెట్ట ప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నారు. డిండి ఎత్తిపోతల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత తీర్చా లన్నారు. ఫ్లోరైడ్ ప్రభావంతో బాధపడు తున్న కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్ల సంఖ్యను పెంచాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగా లను భర్తీ చేయడంతో పాటు, స్థానిక పరిశ్రమల్లో జిల్లా యువతకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. నల్లగొండ జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన ఫ్లోరోసిస్ విముక్తికి ఎసఎల్బీసీ¾ టన్నెల్ ఒక్కటే మార్గమని, ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని నెల్లికంటి విజ్ఞప్తి చేశారు.


