ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..


ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇంటర్మీడియట్ మూల్యాంకనానికి అమలు చేస్తున్న నిబంధనలనే ఇకపై పదో తరగతికి కూడా వర్తింపజేయనున్నారు. ఇందులో భాగంగా మార్కులను నేరుగా ట్యాబ్‌లలో నమోదు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల లెక్కింపులో తప్పులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ మూల్యాంకనంలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడితే, దానిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తారు. అనంతరం సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీ చేసి వివరణ కోరతారు. వారిచ్చే వివరణను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *