. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
. 40 శాతానికిపైగా వైకల్యముంటే వర్తింపు
. 12.76 లక్షల మందికి లబ్ధి
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం హామీనిచ్చారు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, అంధులు, మూగవారు, చెవిటి వారికి, మానసిక దివ్యాంగులకు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో చార్జీ లేకుండా రాష్ట్రమంతా ప్రయాణించవచ్చు. వారి సహాయకులకు 50 శాతం రాయితీ లభిస్తుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నది. ఇప్పటివరకు నాలుగు వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని విస్తరించింది. శారీరక-మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ధి చేకూరుతుండగా ఇకపై 11.16 లక్షల మంది (పురుషులు 6.86 లక్షల మంది సహా) లబ్ధి పొందగలుగుతారు. 33,800 మంది సహాయకులకే రాయితీ ఇచ్చారు. ఇకపై 1.60 లక్షల మంది సహాయకులకు 50 శాతం రాయితీ లభించనుంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 2.05 లక్షల నుంచి 12.76 లక్షలకు పెరగనుంది. స్త్రీశక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీలో 73 శాతం బస్సులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు మూడేళ్లకు ఇచ్చిన పాసులు కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి ఉపయోగించవచ్చు. డిజిటల్ పాస్‌లను మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చు. ఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలో దివ్యాంగులకు ఈ సేవలు అందుతాయి. క్యూఆర్ కోడ్‌తో ఉచిత డిజిటల్ పాస్‌లు జారీ చేస్తారు. దివ్యాంగ శక్తి అమలుకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.207 కోట్ల సబ్సిడీ అందిస్తుంది. గతేడాది ఆగస్టు 15న స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తే… ఈ నెల 15 నాటికి (అంటే 7 నెలల్లో) 52 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. మహిళల ఉచిత ప్రయాణాలకు ప్రభుత్వం రూ.8.57 కోట్లు చొప్ప్పున ఒక రోజుకు ఖర్చు పెడుతోంది. సగటున 24.38 లక్షల మంది స్త్రీ శక్తిని రోజూ వినియోగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయానించే ప్రతి వంద మందిలో 63 మంది మహిళలే ఉంటున్నారు.
The post నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం appeared first on Visalaandhra.


