ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట.. కేంద్రం కీలక ప్రకటన.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!


ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌కు మళ్లీ ఈ-కేవైసీ చేయించాలంటూ వస్తున్న వార్తలపై నెలకొన్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఈ-కేవైసీ ప్రక్రియ అందరికీ తప్పనిసరి కాదని, కేవలం కొందరికి మాత్రమేనని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసి వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేసింది.

ఇప్పటికే కేవైసీ పూర్తి చేసుకున్న సాధారణ వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. కేవలం ఇప్పటివరకు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (ఈ-కేవైసీ) పూర్తి చేయని వారు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు మాత్రమే దీన్ని చేయాల్సి ఉంటుందని వివరించింది. ఉజ్వల పథకం కింద కనెక్షన్ పొందిన వారు సబ్సిడీ ప్రయోజనాలు కొనసాగడానికి ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని పేర్కొంది. ముఖ్యంగా 7 సిలిండర్ల తర్వాత 8, 9వ సిలిండర్ రీఫిల్‌పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరమని స్పష్టం చేసింది.

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రమవుతుంది. దాదాపు రెండు వారాలుగా దాడులు జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం, గల్ఫ్ దేశాలపై దాడులతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హార్ముజ్ జలసంధి నుంచి నౌకలను ఇరాన్ అనుమతించకపోవడంతో భారత్‌లో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. వంట గ్యాస్ నిల్వలు తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య వినియోగంపై ఆంక్షలు విధించింది. గృహ వినియోగానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చమురు కంపెనీలను ఆదేశించింది. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ పెరగకుండా, సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచకుండా చర్యలు చేపట్టింది.  బుకింగ్ గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇదే సమయంలో గ్యాస్ వినియోగదారులు ఇ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలే గ్యాస్ వినియోగదారుల్లో గందరగోళానికి దారితీశాయి. ఇటీవలే కేవైసీ పూర్తి చేశామని, మళ్లీ ఇప్పుడు పూర్తి చేయాలా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. గ్యాస్ ఏజెన్సీల వద్దకు కస్టమర్లు క్యూ కడుతున్నారు.

ఈ-కేవైసీ ప్రక్రియను వినియోగదారులు తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా నకిలీ కనెక్షన్లను గుర్తించడం, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడం సులభమవుతుందని వివరించింది. ఎలాంటి అంతరాయం లేకుండా సిలిండర్ల సరఫరా జరుగుతుందని హామీ ఇచ్చింది. మొత్తం మీద, కేంద్రం చేసిన ఈ తాజా ప్రకటనతో గ్యాస్ వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళన, గందరగోళానికి తెరపడినట్లయింది.

The post ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట.. కేంద్రం కీలక ప్రకటన.. ఇ-కేవైసీ వారికి మాత్రమే! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *