మాకు ఎవరి అవసరమూ లేదు..


: ట్రంప్
ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం ఇష్టం లేదని స్పష్టం చేయగా, జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ఇది మా యుద్ధం కాదు, మేము దీనిని ప్రారంభించలేదు అని కుండబద్దలు కొట్టారు. జపాన్, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు కూడా తమ యుద్ధనౌకలను పంపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాత్రం రక్షణ పరంగా సహకరిస్తామని చెప్పినా, ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా సైనిక చర్యకు సిద్ధంగా లేమని పేర్కొన్నారు.

తన విజ్ఞప్తికి స్పందించని దేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. గత 40 ఏళ్లుగా మిమ్మల్ని మేమే రక్షిస్తున్నాం. ఇప్పుడు మాత్రం మీరు మాకు తోడుగా రావడం లేదు. హర్మూజ్ ద్వారా 90 శాతం చమురు పొందే చైనా వంటి దేశాలు కూడా దీని రక్షణ కోసం బాధ్యత తీసుకోవాలి అని ఆయన అన్నారు. చైనా సహకరించని పక్షంలో ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరగాల్సిన భేటీని రద్దు చేసుకుంటానని కూడా హెచ్చరించారు.

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇరాన్ దీనిని మూసివేయడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా ఇప్పటికే ఇరాన్ తీర ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నప్పటికీ, ఇతర దేశాల మద్దతు లేకపోవడం ట్రంప్ యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారింది. మిత్రదేశాల ప్రతిస్పందనను చూడాలనే నేను ఈ ప్రతిపాదన చేశాను. అసలు అవసరమైనప్పుడు వారు మా పక్కన ఉండరని నాకు ఎప్పుడో తెలుసుఁ అని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

The post మాకు ఎవరి అవసరమూ లేదు.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *