రాష్ట్రంలో భావజాల విధ్వంసం!


సంగిరెడ్డి హనుమంత రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు మూడు ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. అనవసర అంశాలను తెరపైకి తెచ్చి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం. తిరుమల “కల్తీ”లడ్డు తిని ఎందరు చనిపోయారో తెలియదు. పాలకుల దృష్టిలో అది సర్వజన సంహారిణి. ఆహార ముడి పదార్థాల, హోటళ్ళలో ఆహార కల్తీలను, భూజల, వాయు, శబ్ద పర్యావరణ కాలుష్యాలను పట్టించుకోరు. గుడి గోడలు కూలి, దర్శనాల క్యూలో తోపుళ్ళకు ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు కనపడరు. రోడ్ల ప్రమాదాల్లో రోజూ చనిపోతున్న అమాయకులు పట్టరు. 2. ప్రజల్లో వైదికవాద ప్రచారం. తొలినాళ్ళలో చేగువేరా చొక్కాలు తొడుక్కొని యువతను దారి తప్పించిన పవన్ అర్థం లేని సనాతన ధర్మం సంకరమౌతోందని ఊగారు. సనాతన ధర్మ రక్షణ జాతీయ సంస్థను స్థాపించాలని చిందులేశారు. బాబు లౌకిక మూల పార్టీ అలౌకికమైంది. స్థాపక సూత్రాలను తుంగలో తొక్కారు. మతతత్వంతో అంటకాగుతున్నారు. చంద్రన్న పాలనలో నదులకు దీపారాధన ప్రారంభించారు. కుంభమేళాతో సమానంగా గోదావరి పుష్కరాలను జరుపుతారట! గోదావరి గత పుష్కరాల్లో 19 మందిని చంపారు. కుంభమేళాలో 2025 జనవరి 29న ప్రయాగరాజ్ వద్ద ప్రభుత్వ లెక్కల ప్రకారం 37 మంది చనిపోయారు. 200 మంది గాయపడ్డారు. భూజల వాయు కాలుష్యాలు ఘోరంగా పెరిగాయి. జనజీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ ఘనతలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగేటట్లు జాగ్రత్త వహిస్తారన్న మాట! 3.స్వార్థంతో రాష్ట్ర కాషాయీకరణ. గెలుపుపై అపనమ్మకంతో, 2002లో, 2018లో విమర్శించిన నరహంతక పాలకులతో కూటమి కట్టారు. సంఘ్ తాత్వికుల విగ్రహాలు పెడుతున్నారు. కేంద్ర పాలకుల అనుకూల సంఘ్ సూత్రాలతో రాష్ట్ర పాలన సాగిస్తున్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం జాతీయ సంపద నిర్వహణ చట్టం చేసింది. దీని ప్రకారం లాభాల ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్లకు పంచారు. జాతి సంపదలను ఆశ్రితపక్ష కార్పొరేట్లకు బదలాయించారు. ముఖ్యమంత్రి ఈ సంఘ్ సూత్రాన్ని అనుకరిస్తున్నారు. గత ప్రభుత్వాలు స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్లకు అప్పగించటం అందులో భాగమే. రైతుల 70 వేల ఎకరాల రాజధానిలో వందల ఎకరాలు కార్పొరేట్లకు కట్టబెట్టారు. వాళ్ళు మిగిలిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. ఈ స్వామి కార్యంలో స్వార్థ స్వకార్యం, నీకిది, నాకది సూత్రం అంతర్భాగాలు. ఒకవైపు ప్రజల ఆస్తులు, సంస్థలు, సంపదలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. మరొకవైపు 4పిల శీర్షికలో ప్రజలను కలిపి వారిని మోసగిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జాతిపిత మోహనచంద్ గాంధీ, రాజ్యాంగ ప్రధాన నిర్మాత బాబా సాహెబ్ ఆంబేదƒ్కర్, మౌలిక భౌతిక వసతుల దేశ నిర్మాత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూల విగ్రహాలను స్థాపించలేదు. సంఘ్ తొలి ప్రధాని, 24 పార్టీల సంకీర్ణంలోనే ప్రైవేటీకరణను, దేశ సంపదల, సంస్థల అమ్మకాలను చట్టబద్దం చేసిన, దేశాన్ని అశాస్త్రీకరించిన, “ఇతర” మతంపై విషయం చిమ్మిన అటల్ బిహారి వాజపేయి విగ్రహాన్ని నిర్మించారు. రాష్ట్ర ప్రధాన నగరాల్లో, ప్రతి జిల్లా రాజధానిలో ఆయన బొమ్మలను పెడతారట. రాష్ట్రమంతా సంఘ్ రంగు పులుముతారట. సంఘ్ పూర్వీకుల్లో స్వాతంత్య్ర సమరయోధులు లేరు. ఆ లోటును పూరించడానికి, కాంగ్రెస్‌వాది వల్లభ్ పటేల్‌ను మోదీ సొంతం చేసుకున్నారు. గ్రహణ చంద్రన్న ఆంధ్ర అన్న ఎన్టీఆర్ పై ఆధారపడ్డారు. ఆ అన్న 116 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో 200ఎకరాల స్మారక పథకంలో, భూమి ఖరీదు కాకుండానే, రూ.1,750 కోట్ల విగ్రహ ఖర్చుతో నిర్మిస్తారట. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య సౌకర్యాల కల్పన, నిర్వహణలకు కేటాయించిన మొత్తం రూ.1,900ల కోట్లు రూ.1,750 కోట్లతో 9 పెద్ద వైద్యశాలలను, ఏటా1,350 మంది వైద్యులను తయారుచేసే 9 వైద్య కళాశాలలను స్థాపించవచ్చు. గిరిజన ప్రాంతాల్లో వందల పాఠశాలలను, వసతి గృహాలను, వైద్యశాలలను నిర్మించి నిర్వహించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రూ.873 కోట్లతో 49 పారిశ్రామిక వాడలను ప్రతిపాదించింది. 1,750 కోట్లతో 100 పారిశ్రామికవాడలను స్థాపించవచ్చు. గుంటూరు శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ లాంటి 18 బ్రిడ్జ్‌లను కట్టవచ్చు. ఈ నిర్మాణాలకు రామన్న, చంద్రన్న, లోకన్న, దేవన్న, పవనన్న పేర్లను పెట్టుకోవచ్చు. రాష్ట్ర జాబితాలోని 61 అంశాల్లో జనహిత చట్టాల నిర్మాణం, అమలు, రాజ్యాంగబద్ద లౌకిక పాలన నేటి రాష్ట్ర అవసరం. ప్రజలను మతాధారంగా విడగొట్టే కేంద్ర అలౌకిక అరాచక పాలనకు, చట్టాలకు అంధ సమర్థన, అనుసరణ, అనుకరణ అవాంఛనీయాలు.
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి,
గుంటూరు సెల్ : 94902 04545

The post రాష్ట్రంలో భావజాల విధ్వంసం! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *