మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం
దిల్లీ: అమెరికా ప్రయోజనాల కోసం రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం కాల రాస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా ప్రయోజనాల కోసం రైతులను దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలకు కనీస మద్దతు ధరలకు సంబంధించి రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చడంలేదని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం దేశ వ్యవసాయాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు. కనీస మద్దుతు ధర(ఎమ్మెస్పీ) గురించి లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వలేదన్నారు. “అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందం ఎమ్మెస్పీపై మోదీ ప్రభుత్వ విధానంలో మార్పుతీసుకురాబోతుందా? ‘వాణిజ్యయేతర’ అవరోధాలను తొలగించడం గురించి అమెరికా మాట్లాడుతుందా? దాని ఉద్దేశం ఎమ్మెస్పీ యంత్రాంగాన్ని, వ్యవసాయ ఉత్పత్తుల ప్రభుత్వం కోనుగోలు విధానాన్ని ఇది క్రమంగా బలహీనపరుస్తుందా?” అని రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురుపించారు. రైతుల హక్కులను కాపాడేందుకు పార్లమెంటు లోపల, వెలుపల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స’లో రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.


