2,256 గహ ప్రవేశాలకు సిద్దం
నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి…
- ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విశాలాంధ్ర`విజయవాడ: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులు తమ సొంతింటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా జక్కంపూడిలో నిర్మించిన 2,256 టిడ్కో ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.. శనివారం కలెక్టర్ జి. లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు తదితరులతో కలిసి జక్కంపూడిలోని టిడ్కో ఇళ్ల ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తయిన ఇళ్లలో కల్పించిన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య వ్యవస్థలు, నీటి సరఫరా ఏర్పాట్లు, రహదారులు, పరిసరాల అభివృద్ధి వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతతో పూర్తయిన తీరును గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు కలెక్టర్కు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వివరిస్తూ గృహ సముదాయంలో సైట్ ఏలో నివసించే ప్రజలకు తాగునీటి సరఫరా అందించేందుకు 5 లక్షల లీటర్ల ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయిందని, మిగిలిన సైట్లకు సంబంధించిన 14 లక్షల లీటర్ల ట్యాంకు పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ కోసం సీవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు వివరించారు. కాలువలు, డ్రైనేజీ వ్యవస్థలు, విద్యుత్ సదుపాయం, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతోందన్నారు. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో టిడ్కో ఇళ్లు నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపారు. జక్కంపూడిలోని సైట్ ఎలో 23 బ్లాకుల్లో నిర్మించిన 1,104 ఇళ్లు, సైట్ డిలోని 24 బ్లాకుల్లో నిర్మించిన 1,152 ఇళ్లు మొత్తం 2,256 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ వివరించారు. మిగిలిన సైట్ బి, సైట్ సి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టిడ్కో, మునిసిపల్ ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
The post ఉగాది టిడ్కో ఇళ్లు పంపిణీ appeared first on Visalaandhra.


