విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి ఒకే వేదికపై శిక్షణ శిబిరం నిర్వహించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జరగడం గమనార్హం.
ఈ నెల 15 నుంచి 20 వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే అండర్–21 జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొననున్నాయి. ఈ శిబిరానికి స్థానిక శాసనసభ్యురాలు లోకం నాగమాధవి ఆతిథ్యం ఇచ్చారు. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కొణిదల నాగేంద్రబాబు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి చేతుల మీదుగా క్రీడాకారులకు క్రీడా దుస్తులు, వ్యాయామ దుస్తులు అందజేశారు.
ఈ శిక్షణ శిబిరాన్ని గవర సూరిబాబు, కె.వి.ఏ.ఎన్. రాజు (చిన్నారి) ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణరాజు, పాల్తేరు శ్రీను, కోరాడ రమణ, సాయి కుమారి, శేఖర్, సాంబ సహాయ శిక్షకులుగా క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు. పురుషుల జట్టుకు శిక్షకులుగా గవర సూరిబాబు, కె.వి.ఏ.ఎన్. రాజు వ్యవహరించగా, ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టుకు నిర్వహణాధికారిగా రామచంద్రపేట వ్యాయామ ఉపాధ్యాయుడు కోరాడ రమణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ సందర్భంగా నాగేంద్రబాబు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు ఆశీస్సులు అందజేశారు.


