విశాలాంధ్ర – భోగాపురం : నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శాసనసభ్యులు లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన కృషి చేస్తోంది. ఉద్యమి సభ్యత్వం అనేది ఒక నవ సమాజ నిర్మాణానికి పునాది,” అని పేర్కొన్నారు. సామాజిక మార్పు కోసం పనిచేయాలనే నిబద్ధత కలిగిన వారిని ఉద్యమి సభ్యత్వాల ద్వారా పార్టీలో భాగస్వాములను చేయాలని సూచించారు. సంఖ్యకోసం కాకుండా పార్టీ సిద్ధాంతాలపై పూర్తి అవగాహన కలిగిన వారినే సభ్యులుగా చేర్చుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రతిపాదించిన ఏడు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సాధకుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పారదర్శక రాజకీయాలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.విజయనగరం జిల్లాలో జనసేన జెండాను మరింత ఎత్తున ఎగురవేయడానికి సాధకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాలలో ముఖ్య నాయకులు పాల్గొని సభ్యత్వ నమోదు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.


