డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి
విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.
విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెవి లోపలి భాగంలోని వెస్టిబ్యులర్ వ్యవస్థలో లోపాలు, మీనియర్స్ వ్యాధి, చెవి ఇన్ఫెక్షన్లు, రక్తపోటు మార్పులు, మైగ్రేన్ వంటి కారణాల వల్ల కూడా వెర్టిగో సమస్య ఏర్పడవచ్చని చెప్పారు. ప్రత్యేకంగా వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆయన తెలిపారు. వెర్టిగో వచ్చినప్పుడు తల తిరగడం, నడకలో స్థిరత్వం కోల్పోవడం, వాంతులు, చెమటలు పడటం, చెవిలో మోత వినిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చని వివరించారు. ఈ సమస్యను నిర్ధారించేందుకు చెవి పరీక్షలు, నాడీ వ్యవస్థ పరిశీలనతో పాటు అవసరమైతే ఎంఆరఐ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సరైన చికిత్స తీసుకుంటే వెర్టిగో నుంచి పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అలాగే వెర్టిగో సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్యుల సలహా తీసుకోవడం అవసరమని సూచించారు. రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవడం, తగినంత నిద్ర, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం వంటి జీవనశైలి మార్పులు కూడా వెర్టిగో నివారణకు సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.


