పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్న అయ్యర్, థరూర్
న్యూదిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, శశిథరూర్ బహిరంగ లేఖల రూపంలో తాజాగా పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. థరూర్‌తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్లు అయ్యర్ పేర్కొనగా.. ఆయన తీరును థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. థరూర్‌కు అయ్యర్ రాసిన బహిరంగ లేఖ ఓ మ్యాగజీన్‌లో ఇటీవల ప్రచురితమైంది. ఈ నెల 6న థరూర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ… ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం గురించి చేసిన వ్యాఖ్యలు తనను విస్మయానికి గురిచేశాయని అందులో పేర్కొన్నారు. “నేను నిద్ర కూడా పోలేనంత తీవ్రంగా కలత చెందాను. తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీకు (థరూర్‌కు) ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో…నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ మీకు ఓటేశాను. తర్వాత కూడా మీకు పార్టీలో సముచితá స్థానమివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖ¹&్గతో వాదనకు దిగాను. అప్పట్నుంచి గాంధీలు, ఖడ్గే నన్ను కలవడానికి సుముఖత చూపలేదు. కానీ ఇప్పుడు మీ వ్యవహార శైలి చూస్తుంటే.. నేను చేసింది సరైంది కాదనిపిస్తోంది. స్థాయీసంఘం ఛైర్మన్‌గా ఉన్న మీరు.. విదేశాంగ విధానంపై నిర్ణయాలను పూర్తిగా ప్రభుత్వ ఇష్టానికే వదిలేశారు. అలాంటప్పుడు మీరు ఛైర్మన్‌గా ఉండటంలో అర్థమేముంది? శబరిమల ఆలయంలోకి అందరు మహిళలకూ ప్రవేశం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును మీలాంటి మేధావి, ఆధునిక భావజాలమున్న వ్యక్తి తప్పుబట్టడం నమ్మలేకపోయాను. మీరు మాలో ఒకరు కాదని ఈ పరిణామాలతో అర్థమైంది. అందుకే మీతో సంబంధాలు తెంచేసుకుంటున్నా” అని థరూర్‌ను ఉద్దేశించి అయ్యర్ పేర్కొన్నారు.
దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం…థరూర్
అయ్యర్ లేఖకు బదులిస్తూ థరూర్ కూడా బహిరంగ లేఖ రాశారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లేందుకు భిన్నాభిప్రాయాలు దోహదపడతాయని అందులో పేర్కొన్నారు. కానీ విదేశాంగ విధానాల విషయంలో భిన్నమైన పంథా అనుసరిస్తున్నాడన్న కారణంతో సహచరుడి దేశభక్తిని, ఉద్దేశాలను ప్రశ్నించడం ఎంతమాత్రమూ సరికాదన్నారు. “అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో తానెప్ప్పుడూ జాతీయవాద దృక్పథంతోనే ముందుకెళ్లాను. భారత ప్రయోజనాలు, భద్రతకే ప్రాధాన్యమిచ్చాను. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు వెళ్లినప్పుడు తప్ప…ఇంకెప్పుడూ నా విదేశీ ప్రయాణాలకు ప్రభుత్వం నిధులివ్వలేదు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో నాకు మద్దతిచ్చినందుకు మీకు (అయ్యర్‌కు) రుణపడి ఉంటాను. కానీ ఆ విషయంలో మీరిప్ప్పుడు చింతిస్తుండటం నాకు బాధేస్తోంది. తాను కూడా పార్టీ హైకమాండ్ ముందు మీకు గట్టి మద్దతిచ్చాను. ముఖ్యంగా మీరు పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పుడు అండగా నిలిచాను. నాతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు చెప్పడం ద్వారా మీ కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నారు” అని అయ్యర్‌ను ఉద్దేశించి థరూర్ పేర్కొన్నారు.


