. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి
. వామపక్ష నేతల పిలుపు
. ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసన
విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదంతో అనేక దేశాలపై దాడులకు పాల్పడుతున్న అమెరికా దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు ఎగుమతులు చేస్తున్నాయని, అణుబాంబులు ఉన్నాయనే కుంటిసాకులతో స్వప్రయోజనాల కోసం అమెరికా విచక్షణారహితంగా చిన్న చిన్న దేశాలపై దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు సాగిస్తున్న దమనకాండను ఖండిస్తూ... స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు పది వామపక్షపార్టీల అధ్వర్యంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ... చిన్న పిల్లల్ని సైతం బాంబులు వేసి చంపుతూ ప్రపంచ ఉగ్రవాద దేశంగా అమెరికా అవతరించిందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేస్తున్న శాంతి ఉద్యమంపై మతోన్మాదులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్‌పై అమెరికాఇజ్రాయిల్ యుద్ధం వల్ల ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోందని…వ్యాపారాలు మూతపడుతున్నాయని, ఉద్యోగాలు పోతున్నాయన్నారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోదీ, ఆరఎసఎస్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రోనాల్డ్‌రీగన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా మనదేశంపై ఆంక్షలు పెట్టబోతే… మాకు ఎవరు స్నేహితులగా ఉండాలో, ఎవరిని వదులుకోవాలో భారతదేశ ప్రజలు నిర్ణయిస్తారని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గట్టిగా సమాధానం ఇచ్చారని… మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మా దేశ ఆంతరంగిక అంశాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకి హెచ్చరిక చేశారని… బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా Ž పోఖ్రాన్ అణుపరీక్షలు చేసి అమెరికాని ఏమాత్రం లెక్కచేయలేదని గుర్తు చేశారు. మోదీ ప్రధానిగా ఉండటం భారత ప్రజల దౌర్భాగ్యం అన్నారు. 30 రోజుల పాటు రష్యా వద్ద చమురు కొనుగోలు చేయవచ్చని ట్రంప్ చెప్పటం ఏంటని ప్రశ్నించారు. మోదీ దేశ సార్వభౌమాధికారాన్ని ట్రంప్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. ఖామేనీ దురాగతాలను కూడా కమ్యూనిస్టులు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదులను ఏరివేయాలని… యుద్ధం వద్దని చెప్పామన్నారు. అమెరికా అభివద్ధి చెందిన దేశాలను చిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే విజయవాడలో వ్యాపారాలు మూతపడుతున్నాయని చెప్పారు. శాంతి కోసం కలిసి వచ్చే శక్తులతో దేశవ్యాప్తంగా వామపక్షాలు ఉద్యమాలు చేస్తాయని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… మోదీ ప్రభుత్వం ఇజ్రాయిల్‌కి కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. గజాలో ప్రజలు తమ సొంతగడ్డపై శరణార్థులుగా జీవించే దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. ఇరాన్‌ను అడ్డం పెట్టుకుని అమెరికా ప్రపంచంపై దాడి చేస్తోందన్నారు. శ్రీలంకలో ఇరాన్ నౌకను అమెరికా పేల్చేసిందని…ఈ పరిస్థితుల్లో భారతదేశానికి భద్రత ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు.
గోదావరి తీరంలోని గ్యాస్‌ను గుజరాత్‌కు తరలించినందుకుగాను అమెరికాలో అదానీకి 300 బిలియన్ డాలర్ల విలువ చేసే చమురుశుద్ధి కేంద్రాన్ని బహుమతిగా మోదీ ఇప్పించారని ఆరోపించారు. ట్రంప్ వద్ద లొంగుబాటును కూడా విజయంగా మోదీ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్ మాట్లాడుతూ ఇరాన్‌కు సంఘీభావం ప్రకటించటంతో పాటు వివిధ దేశాలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఉద్యమించాలన్నారు. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు డి.హరనాథ్, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు అమర్నాథ్, ఎంసీపీఐ నాయకులు ఎస్కే.ఖాదర్‌బాష, సీపీఐ ఎంఎల్ నాయకులు కిషోర్, ఎం.రామకష్ణ, ఆరఎస్‌పీ నాయకులు జానకిరామయ్య ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. నిరసన ప్రదర్శనలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.దుర్గాభవానీ, కార్యవర్గ సభ్యులు టి.మనోహర్ నాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తదితరులుతో పాటు వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్ధి, యువజన, మహిళా, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.చంద్రనాయక్, అనిల్ సారథ్యంలో ప్రజానాట్య మండలి కళాకారులు యుద్ధం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ ఆలపించిన గీతాలు ఆలోచింపజేశాయి.


